Thane, April 16: కిచిడిలో (Kichidi) ఉప్పు ఎక్కువ వేసిందని భార్యను (wife Murdered) చంపేశాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భయాండర్ టౌన్‌షిప్‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నీలేష్ గాగ్(46), నిర్మల(40) అనే ఇద్దరు దంపతులు భయాండర్ టౌన్‌షిప్‌లోని పఠాక్ రోడ్డులో నివాసముంటున్నారు. అయితే నిర్మల శుక్రవారం ఉదయం అల్పాహారంలో భాగంగా కిచిడి వండింది. తన భర్తకు ఉదయం 9:30 గంటల సమయంలో నిర్మల కిచిడి (Kichidi) వడ్డించింది. కిచిడి రుచి చూసిన భర్తకు క్షణాల్లోనే కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఆహారంలో ఉప్పు ఎక్కువైందని భార్యను మందలించాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతుకు బట్ట చుట్టి చంపేశాడు. అయితే భార్యను కిచిడీ కోసం చంపేశాడన్న వార్తను విన్న స్థానికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా ఈ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని చుట్టుపక్కలవారు చెప్తున్నారు. చాలాసార్లు అతను తన భార్యపై చేయి చేసుకున్నాడని, క్షణికావేశంలో ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.