Mumbai, March 17: భారత్ లోనూ కరోనావైరస్ చాపకింద (Coronavirus spread) నీరులా విస్తరిస్తోంది. దేశంలో మూడో కరోనావైరస్ మరణం (Third Coronavirus Death) మంగళవారం నమోదైంది. 64 ఏళ్ల COVID-19 రోగి ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు మన దేశంలో రెండు కరోనావైరస్ మరణాలు ఒకటి దిల్లీ నుంచి, మరొకటి కర్ణాటక రాష్ట్రం నుంచి నమోదైంది.
వయసు మీద పడిన వారికి, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దిల్లీలో కరోనా ప్రభావంతో మరణించిన మహిళ వయసు 68 ఏళ్లు కాగా, కర్ణాటక నుంచి చనిపోయిన వ్యక్తి వయసు 76 ఏళ్లు. మరోవైవు ఈయనకు చికిత్స చేసిన డాక్టర్ (63) కు కూడా కరోనావైరస్ సోకింది. డాక్టర్‌కి కూడా కరోనాలక్షణాలు కనిపించడంతో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. మంగళవారం వచ్చిన ఆయన రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. మంగళవారం ఉదయం భారత్ లో రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి కర్ణాటకకు చెందిన ఈ డాక్టర్ కాగా, మరొక కేసు హరియాణ రాష్ట్రంలో నమోదైంది. కాగా, ఇది హరియాణ రాష్ట్రం నుంచి తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు కావడం గమనార్హం.
Check ANI update:
Maharashtra: A 64-year-old COVID-19 patient passes away at Mumbai's Kasturba hospital pic.twitter.com/E1X8Dj78n0
— ANI (@ANI) March 17, 2020
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 125 అని ఈరోజు ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు. కేరళలో 22 కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఎక్కువ కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివే కావడం గమనార్హం. అయితే సోమవారం మహారాష్ట్రలోని పుణెలో నమోదైన 5 కేసుల్లో రెండో వ్యక్తి ద్వారా వ్యాప్తి జరిగింది. వీరి బంధువుల్లో ఒకరు విదేశాలకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. అతడికి పాజిటివ్ అని తేలింది, అతడి ద్వారా ఈ 5గురికి వైరస్ సంక్రమించింది.