Hyderabad, March 17: తెలంగాణలో(COVID 19 in Telangana) కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4కు పెరిగింది. మార్చి 12న స్కాట్లాండ్ నుంచి హైదరాబాద్ వచ్చిన 46 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో మార్చి 15న గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతడికి రక్తపరీక్షలు నిర్వహించి ఒక నమూనాను పుణెకు పంపించారు. రెండు రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. దీంతో బాధితుడికి గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా రోగితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారైంటైన్ లో ఉంచారు.
కాగా, తెలంగాణలో మొదటి కోవిడ్19 కేసుగా నమోదైన 24 ఏళ్ల టెకీ, చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యాడు. ఇక మిగిలిన ముగ్గురు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
రాష్ట్రంలో కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుంది. విదేశాల నుంచి వచ్చే వారందరినీ శంషాబాద్ లో ల్యాండ్ అవ్వగానే వారిని సిటీలోకి అనుమతించకుండా, ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వారిని గచ్చిబౌలి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిర్బంధ కేంద్రాలకు తరలించి 14 రోజుల పాటు వారిని క్వారైంటైన్ పీరియడ్ లో ఉంచుతున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారిని వేరు చేసి ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. వారికి మంచి భోజనం, వైఫై సౌకర్యం తదితర వసతులన్ని కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్ తదితర వాటికి మార్చి 31 వరకు సెలవులు ప్రకటించారు. ఓయూ హాస్టళ్లను కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు వీసీ ప్రకటించారు. రేపట్నించి ఓయూ హాస్టళ్లకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మహారాష్ట్రలో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఆలయాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. పలు రాష్ట్రాల్లో థియేట్లరు, స్కూళ్లు, పబ్‌లు, మాల్స్ అన్నీ బంద్
ఇక దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID 19 in India)మంగళవారం ఉదయం నాటికి 131కి చేరినట్లు సమాచారం, మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా 39, దాని తర్వాత కేరళ (Kerala) 22 ఉన్నాయి. అయితే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ధృవీకరించిన గణాంకల ప్రకారం పాజిటివ్ కేసుల సంఖ్య 125గా ఉంది.
Here's a List of States and UTs with Positive COVID-19 Cases:
Ministry of Health and Family Welfare: Total number of confirmed #COVID19 cases in India is 125 pic.twitter.com/jijFKpYwor
— ANI (@ANI) March 17, 2020
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 7,007. అత్యధిక మరణాలు చైనా నుంచి 3,213 కాగా, దీని తరువాత ఇటలీలో 2,158 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 175,536కు పెరిగింది.