New Delhi, March 05: జాతీయ రదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో మరింత భారం పడనుంది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలను 5 శాతం నుంచి 10శాతం మేర పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా టోల్‌రేట్లను (Toll Prices) సవరిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితులు, వినియోగదారుల సంఖ్య, గతంలో వసూలైన టోల్ రుసుముల అధారంగా నిర్ణయం తీసుకుంటారు. టోల్ వసూళ్ల (Toll) విషయంలో మార్పులు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. మార్చి చివరి వారం నాటికి దీనిపై నిపుణుల అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు కార్లకు, సాధారణ వాహనాలకు ఎంత రుసుము వసూలు చేయాలి? భారీ వాహనాలకు ఎంత మేర వసూలు చేయాలన్న దానిపై అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
ఇటీవల దౌసా వరకు ప్రారంభమైన ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే (Delhi-Mumbai Highway) మార్గంలోనూ టోల్‌రేట్లు పెంచే అవకాశముంది. ప్రస్తుతం ఈ మార్గంలో కిలోమీటరుకు రూ.2.19 వసూలు చేస్తున్నారు. ఈ మార్గంలో కనీసం 10శాతం మేర టోల్‌ఛార్జీలను పెంచే అవకాశముంది. ఈ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించిన వాహనాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక రోజులో దాదాపు 20 వేల వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. రానున్న ఆరు నెలల్లో ఈ సంఖ్య 50 వేల నుంచి 60 వేలకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం.. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ.. నాన్ కమర్షియల్ వాహనదారులకు అధికారులు నెలవారీ పాస్‌లను అందిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.315 చెల్లించి ఎన్నిసార్లయినా ప్రయాణం చేసుకునే వీలుంది. అయితే, తాజాగా నెలవారీ పాసు రేట్లను కూడా 10శాతం మేర పెంచే అవకాశముంది.