Hyderabad, October 30: ఆర్టీసీ కార్మికులు ఈరోజు తలపెట్టిన 'సకల జనుల సమరభేరి' (Sakala Janula Samarabheri) సభ సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సభకు హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహిస్తామని జేఏసీ నాయకులు ఇదివరకే ప్రకటించారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరుగుతున్న ఈ సభకు అన్ని పార్టీల విపక్ష నాయకులు సహా పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు (TSRTC Strike) తమ సంపూర్ణ మద్ధతు తెలియజేశారు. 26 రోజులుగా సమ్మె జరుగుతున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ (CM KCR) నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు.
సభ ప్రారంభానికి ముందు ఆర్టీసీ కార్మిక నాయకులు ముక్కు నేలకు రాసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మరియు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆర్టీసీ విలీనం సహా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
TS RTC Employees Protest:
Telangana: Employees of Telangana State Road Transport Corporation (TSRTC) staged protest in Hyderabad today. They rubbed their nose on the ground as a mark of protest against the state government. pic.twitter.com/SQgEmLuBjP
— ANI (@ANI) October 30, 2019
ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డిలతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నుంచి వీ. హన్మంత్ రావు, సీపీఐ నుంచి పల్లా వెంకటరెడ్డి, ఇతర కార్మిక సంఘాల మరియు కుల సంఘాల నేతలు, మందకృష్ణ, ప్రజాగాయకులు విమలక్క తదితరులు ఈ సభకు హాజరయి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారు, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారు, ఆయనకు రాజ్యాంగం మీద ఏమాత్రం అవగాహన లేదు, ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ సభా వేదిక నుంచి నాయకులు విమర్శల బాణాలు సంధిస్తున్నారు.