New Delhi January 02: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత్‌లో పాజిటివ్ కేసులు(India corona cases) భారీగా నమోదవుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో రోజువారీ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించింది. ఢిల్లీ(Delhi) వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. దీంతో త్వరలోనే కరోనా థర్డ్ వేవ్(corona third wave) తప్పదని ప్రజలంతా ఫిక్స్ అయ్యారు. వచ్చే మూడు నెలల్లో మూడో ముప్పు తప్పదని ప్రతి ముగ్గురిలో ఇద్దరు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. లోకల్ సర్కిల్స్ అనే డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం(Local Circles) దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే(Survey)లో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
దేశవ్యాప్తంగా 377 జిల్లాల్లోని 37 వేల మందిపై ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో 68 శాతం పురుషులు, 32 శాతం మహిళలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనిధుల మంజూరుపై ప్రభుత్వం తక్షణం దృష్టిసారించాలని, ప్రతి జిల్లాలో ఆరోగ్య సిబ్బందిని నియమించాలని 81 శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు. పిల్లల కోసం ప్రతి జిల్లాలో డెడికేటెడ్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రారంభించాలని ప్రజలు ఈ సర్వేలో కోరుకున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 87 శాతం మంది, పంచాయతీ కార్యాలయాలను ఐసొలేషన్ సెంటర్లుగా మార్చాలని 79 శాతం మంది అభిప్రాయపడ్డారు.
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రత చాలా అధికంగా’ ఉంటుందని 20 శాతం మంది అభిప్రాయపడగా.. మరో 43 శాతం మంది అధికంగా’ ఉంటుందన్నారు. ఇక థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగానే ఉండనుందని 17 శాతం మంది, అసలు ఎలాంటి తీవ్రత ఉండబోదని 4 శాతం మంది మాత్రమే తెలిపారు. అయితే డిసెంబర్ మొదటి వారంలో కూడా లోకల్ సర్కిల్స్ ఇదే తరహా సర్వే నిర్వహించింది. అప్పుడు 38 శాతం మంది మాత్రమే మూడో వేవ్ వస్తుందని అభిప్రాయపడగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 63 శాతానికి చేరింది. గడిచిన రెండు వారాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులతో ప్రజలు థర్డ్ వేవ్ గురించి గట్టిగా ఫిక్సయ్యారు. ఒమిక్రాన్ ఇదే విధంగా వ్యాప్తి చెందితే దేశంలో ప్రతిరోజు 14 లక్షల కేసులు రావొచ్చని నీతిఆయోగ్ ఇప్పటికే హెచ్చరించింది.