File image of Vizag resident Prashanth who was arrested in Pakistan | Photo Credits : Twitter/ Wikimedia Commons

Lahore, November 19: రాజస్థాన్ నుండి తమ దేశంలోకి అక్రమంగా చొరబడ్డారని ఇద్దరు భారతీయ పౌరుల (Indian Citizens)ను పాకిస్తాన్ (Pakistan) అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ పాకిస్థాన్ జైలుకు పంపించారు. ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం (Vizag)కు చెందిన ప్రశాంత్ (Prashanth) కాగా, మరొకరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దరీలాల్ (Darilala) గా గుర్తించారు. వీరిద్దరూ పాస్ పోర్ట్ లేకుండా దేశంలోకి ప్రవేశించారని పాక్ అభియోగం. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కు తూర్పున ఉన్న బహవల్‌పూర్‌ నగరంలో వీరిద్దరిని పాక్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వీరివద్ద సరైన పత్రాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు.

పట్టుబడిన వారిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా తెలుస్తుంది అంటూ దేశంలో "ఉగ్రవాద దాడి" జరిపేందుకే చొరబడ్డారని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెలువరించింది.

అరెస్ట్ కాబడిన ప్రశాంత్ తో పాక్ పోలీసులు ఫార్మాలిటీ ప్రకారం ఒక వీడియో చిత్రీకరించారు. అయితే ప్రశాంత్ వారి వద్ద అనుమతి తీసుకొని తెలుగులోనే మాట్లాడాడు. “మమ్మీ, డాడీ బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తీసుకువచ్చారు. నా వల్ల ఎలాంటి సమస్య లేదని నిర్ధారణ అయిన తరువాత నన్ను జైలుకు పంపిస్తారు, అక్కడ నుండి భారత రాయబార కార్యాలయ అధికారులకు సమాచారం ఇవ్వబడుతుంది, దాని తర్వాత బెయిల్ ప్రక్రియ మొదలవుతుంది. ఇదంతా జరగడానికి ఒక నెల పట్టొచ్చు , అప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

ప్రశాంత్ మాట్లాడిన వీడియో ఇదే.

 

అయితే తమ కుమారుడు సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తి కాదు, చాలా అమాయకుడు అని ప్రశాంత్ తండ్రి బాబూరావ్ పేర్కొన్నారు. ప్రశాంత్ సురక్షితంగా ఇంటికే చేరే విధంగా ఇండియన్ ఎంబసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఢిల్లీ వెళ్లి ముఖ్య అధికారులను కలువనున్నట్లు తెలియజేశారు.

బాబూరావు కుటుంబం 5 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వాడు. అయితే రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. దీనిపై ఏప్రిల్ 29, 2017న బాబూరావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

హైదరాబాద్ పోలీసుల కథనం ప్రకారం, ప్రశాంత్ రెండేళ్ల క్రితం బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. అక్కడే ఆఫీసులో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ అమ్మాయి, ప్రశాంత్ ప్రేమను అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమె స్విట్జర్ ల్యాండ్ వెళ్లిపోయింది. ప్రేమ విఫలం కావడంతో ప్రశాంత్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఆమెను వెతుక్కుంటూ స్విట్జర్ ల్యాండ్ వరకు నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ వెళ్లి , ఆ ఎడారి మార్గం గుండా పొరపాటున పాకిస్థాన్ లోకి ప్రవేశించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన దరీలాల్ తో ప్రశాంత్ కు పరిచయం ఎలా ఏర్పడింది? ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల సహాకారంతో మరింత సమాచారాన్ని సేకరించి, పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖకు పంపించనున్నారు.

ఇదిలావుండగా, పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేసిన ఆ ఇద్దరు భారతీయుల వివరాలను సేకరించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రయత్నం చేస్తుంది.