Diamond Princess Cruise | (Photo Credits: AFP)

Yokohama, February 13: జపాన్ సమీపంలోని యోకోహామా తీరానికి చేరుకున్న నిర్బంధిత డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో ఉన్న ఇద్దరు భారతీయులకు కరోనావైరస్ సోకింది. బుధవారం వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చిన రిపోర్టుల్లో కోవిడ్19 పాజిటివ్ అని తేలింది.

రెండు రోజుల క్రితమే, ఈ నిర్బంధిత ఓడలో పనిచేస్తూ అందులోనే చిక్కుకున్న భారతీయ సిబ్బంది సోషల్ మీడియాలో ఒక SOS వీడియోను అప్‌లోడ్ చేసారు. తమను త్వరగా రక్షించాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సిబ్బందిలో ఒకరైన ఉత్తర బెంగాల్ కు చెందిన చెఫ్ బినాయ్ కుమార్ సర్కార్ మాట్లాడుతూ పాకిస్థాన్ లో చిక్కుకున్న కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఎలా అయితే కాపాడారో, అలాగే తమ ప్రాణాలను కాపాడటానికి మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

"ఈ విహారనౌకలో మొత్తం 160 మంది భారతీయ సిబ్బందితో పాటు ఎనిమిది మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు, మనవాళ్లలో తొంభై శాతం మందికి వైరస్ సోకలేదు, దయచేసి మమ్మల్ని వీలైనంత త్వరగా రక్షించండి. ఏదైనా జరిగితే ఏం ప్రయోజనం, మోదీజీ దయచేసి మమ్మల్ని వేరు చేసి సురక్షితంగా ఇంటికి తీసుకురండి" అని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో సర్కార్ అన్నారు.

షిప్ లో చిక్కుకున్న మరో చెఫ్ తమిళనాడుకు చెందిన అన్బగలన్ మాట్లాడుతూ "మేం ఇంకా బ్రతుకుతామో లేదో, మాకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. షిప్ లోని ప్రయాణికులను మాకు దూరంగా నడవమని అడుగుతున్నాం, అయినప్పటికీ తినే ప్లేట్లు అన్ని షేర్ చేసుకొని తింటున్నాం, దీనివల్ల మాకు సులభంగా వైరస్ సోకే ప్రమాదం ఉంది. మమ్మల్ని త్వరగా రక్షించండి" అంటూ భారత ప్రభుత్వాన్ని, తమిళనాడు ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నేత స్టాలిన్, నటులు సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లను వేడుకున్నాడు.

ఆ క్రూయిజ్ షిప్ 3,700 మంది ప్రయాణికులను తీసుకువెళుతోంది, సాధారణంగా 1,100 మంది సిబ్బంది మరియు 2,670 మంది ప్రయాణీకుల సామర్థ్యం ఉంటుంది. హాంకాంగ్‌లో డీబోర్డ్ చేసిన ప్రయాణికుల్లో ఒకరికి కొవిడ్ -2019 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఓడలోని మిగతావారికి ఈ వైరస్ సంక్రమించి ఉంటుంది అనే అనుమానంతో వారు బయటకు రాకుండా ఈనెల 4వ తేదీ నుంచి ఈ ఓడను జపాన్ తీరానికి దూరంగా నిర్భంధించి ఉంచారు. ఫిబ్రవరి 19, 2020 వరకు క్రూయిజ్ షిప్‌ నిర్భందంలోనే ఉంచుతున్నట్లు జపాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఫిబ్రవరి 12, 2020 నాటికి, నౌకలో ఉన్న ఇద్దరు భారతీయ సిబ్బంది సహా మొత్తం 174 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది.