Bengaluru November 27: ప్రపంచదేశాలన్నీ ఒమిక్రాన్(Omicron) వేరియంట్ భయంతో వణికిపోతున్నాయి. అయితే ఈ భయం భారత్‌ను కూడా తాకింది. సౌతాఫ్రికా(South Africa) నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా(Corona Positive) నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు(genome sequencing) పంపించారు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో? లేదో? తేలనుంది.
ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. అక్కడ చాలా కేసులు నమోదు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. దాంతో అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల మీద నిఘా పెట్టాయి. ఈ క్రమంలో బెంగళూరు(Bangalore) ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన ఇద్దరు సౌతాఫ్రికా దేశస్తులకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్లను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.
ఇద్దరు సౌతాఫ్రికా వ్యక్తులకు కరోనా నిర్ధారణ అవ్వడంతో బెంగళూరుతో పాటు కర్ణాటక(Karnataka) మొత్తం పోలీసులు, వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో(Bangalore Airport) దిగుతున్న అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసిన తర్వాతనే బయటికి పంపిస్తున్నారు. హైరిస్క్‌లో ఉన్న దేశాల నుంచి ఇప్పటి వరకు బెంగళూరు విమానాశ్రయానికి 584 మంది రాగా.. అందులో 94 మంది ప్రయాణికులు సౌతాఫ్రికా నుంచి వచ్చారు. అందులో ఇద్దరికి కరోనా సోకినట్టు తేలింది.