New Delhi International Airport. (Photo Credit: PTI)

New Delhi, May 24:  దేశంలో కరోనావైరస్ కట్టడి కోసం ఇంతకాలం పాటు నిలిపివేసిన విమానయానానికి ఎట్టకేలకు లాక్ డౌన్ 4.0 లో టేకాఫ్ సిగ్నల్ లభించింది. మే 25, 2020 సోమవారం నుంచి దేశంలోని వివిధ నగరాలను అనుసంధానం చేస్తూ పరిమిత సంఖ్యలో డొమెస్టిక్ ఎయిర్‌లైన్ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి.  కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో కూడా ముంబై నుంచి రోజుకు 25 టేకాఫ్ మరియు ల్యాండింగ్ల చొప్పున దేశీయ విమాన సర్వీసులు నడిచేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రయాణ సమయంలో ఒకరి నుంచి ఒకరికి కరోనావైరస్ వ్యాప్తి జరగకుండా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా 12 అంశాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలన్నింటిని విమానయానం చేసే వారితో పాటు రైళ్లలో మరియు అంతర్రాష్ట్ర బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా తప్పకుండా పాటించాలని సూచించింది.

నిబంధనల ప్రకారం ముందుగా ఎలాంటి కరోనా లక్షణాలను లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరిన తర్వాత 14 రోజుల పాటు తమ ఇంట్లో లేదా మరెక్కడైనా తమ సొంత ఖర్చులతోనే స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఈలోగా ఏవైనా కరోనా లక్షణాలు బయటపడితే వెంటనే జిల్లా ఆరోగ్య అధికారికి గానీ లేదా కోవిడ్ కాల్ సెంటర్ కు గానీ కాల్ చేసి వెంటనే సమాచారం అందించాలి.

విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు మరియు దేశీయంగా ప్రయాణం చేసేవారు ప్రయాణ సమయంలో ఈ నిబంధనలను పాటించడం తప్పనిసరి.

కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు

ప్రస్తుతానికి దేశీయ ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేందుకు కూడా అనుమతి ఉంది. అయితే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియా ఫ్లైట్ ఎక్కేముందే సొంత డబ్బుతో 14 రోజుల పాటు క్వారైంటైన్ కేంద్రాల్లో ఉంటామనే షరతుకు అంగీకరించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ప్రత్యేక పరిస్థితుల్లో హోం క్వారైంటైన్ ను అనుమతిస్తారు. వీరంతా తమ స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి సదరు ట్రావెల్ ఏజెంట్ తమ ప్రయాణికుడికి టికెట్ తో పాటుగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను జాబితాను కూడా తప్పనిసరిగా అందించాలి.

దేశీయంగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు కూడా తమ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది. అయితే తప్పనిసరేం కాదు. ఏది ఏమైనా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్రాలు, వారి రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ నిబంధనల ప్రకారం, ప్రయాణికులకు కూడా లాక్డౌన్ ప్రోటోకాల్ అమలు చేయాలి.

ఇక ప్రయాణికులు అన్ని నిబంధనలను పాటించమని చెప్తూనే, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు మరియు బస్ టర్మినల్ లలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూనే కరోనావైరస్ నివారించగలిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు సూచించింది.