Suresh Angadi | File Photo

New Delhi, September 24: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి బుధవారం కన్నుమూశారు. రెండు వారాల క్రితం కరోనావైరస్ బారిన పడిన ఆయన, చికిత్స కోసం సెప్టెంబర్ 11న దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు, బుధవారం నాటికి మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కొవిడ్ కారణంగా మరణించిన తొలి కేంద్రమంత్రి సురేశ్ అంగడి కావడం గమనార్హం. ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం (బెళగావి) పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సురేశ్ అంగడి కర్ణాటకలో విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఓటమెరుగని నేత. బెల్గాం స్థానం నుంచి ఆయన వరుసగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా ఉత్తర కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం ఆయనకు అదనపు బలం. అలాంటి నేతను కోల్పోవడం బీజేపీకి తీరని లోటుగా చెప్పవచ్చు.

సురేశ్ అంగడి వయసు 65 సంవత్సరాలు. 1955లో జూన్ 1న, బెల్గాం జిల్లాలోని కెకె కొప్ప గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ తో పాటు న్యాయశాస్త్ర కోర్సును కూడా పూర్తిచేశారు. 1996లో బెల్గాం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 2001లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, అనంతరం 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన సురేశ్ అంగడి, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టికరిపించి సత్తా చాటారు.

సురేశ్ అంగడి మృతితో బిజేపీ వర్గం షాక్ కు గురైంది. ఆయన ఆకస్మిక మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

PM Modi Condoles Demise

'సురేశ్ అంగడి ఒక అసాధారణమైన బీజేపీ కార్యకర్త, కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన విశేషమైన కృషి చేశారు. ఒక అంకితభావం కలిగిన ఎంపీ మరియు ప్రభావవంతమైన మంత్రి, అందరి మన్నన్నలు పొందగలిగిన గొప్ప వ్యక్తి. ఆయనని కోల్పోవడం బాధాకరం, ఇలాంటి విషాద సమయంలో నా ఆలోచనలనీ వారి కుటుంబంవైపే ఉంటాయి. ఓం శాంతి' అని మోదీ ట్వీట్ చేశారు.

అటు రాష్ట్రపతి కూడా సురేష్ అంగడి మరణ వార్త తనను షాక్ కు గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.