Bhopal, August 15: భారతీయ బాలికలెవరూ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప, ఇలాంటి వాటికి అంగీకరించరని (Unmarried Girls In India Don't Indulge In Carnal Activities) తెలిపింది. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలను కూడా గమనించాలని తెలిపింది. ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
అయితే పెద్దలు ఒప్పుకోవట్లేదని తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని గత జూన్ నెలలో చెప్పడంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఆమె నుంచి మహకల్ స్టేషన్ పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. పోలీసులు ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను అంగీకరించలేదు.
వేర్వేరు మతాలే వాళ్ల పెళ్లికి ఆటంకంగా మారిందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు పలు కేసుల ప్రస్తావన తీసుకొచ్చిన బెంచ్.. ఇలాంటి వ్యవహారాల్లో కక్కుర్తిపడే మగవాళ్లే, అనుమానితులుగా బయటపడ్డ సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, బాధితులకు అన్యాయం జరిగిన సందర్భాలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం విశేషం