Unnao rape case victim Rape Survivor Set On Fire On Way To Court In UP's Unnao (Photo-PTI)

Lucknow/Unnao,December 6: జస్టిస్ ఫర్ దిషా (Justic for disha) ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాల పట్ల జనాగ్రహం వెల్లువెత్తుతున్నా నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. వారిలో కొంచెం కూడా మార్పు రావడం లేదు. ఉన్నావో ఘటన(Unnao rape victim)లో న్యాయం కోసం కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఉన్నావ్‌లో జరిగింది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు రాయ్‌బరేలీ కోర్టు(Rae Bareli court)కు వెళ్లుతుండగా బెయిల్‌పై ఉన్న నిందితులు ఇతరులతో కలిసి వచ్చి ఆమెను అటకాయించారు. దాడికి యత్నించారు. తప్పించుకునే యత్నం చేయడంతో కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీనితో ఆమెశరీరం 90 శాతం కాలి ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యకొట్టుమిట్టాడుతోంది.

అగ్నికీలలు దహించి వేస్తుండగానే రక్షించాలంటూ ఆమె దాదాపు కిలోమీటరు దూరం పరుగులు పెట్టారు. చివరకు బాధితురాలే 112 నంబర్‌ (Dial 112)కు పోలీసులకూ ఫోన్‌ చేసింది. ఆమె ఫోన్‌ చేసిన తర్వాతే అంబులెన్స్‌ ఘటనాస్థలానికి చేరుకొంది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను ప్రభుత్వం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించింది.

ఆమెను సత్వరమే ఆస్పత్రిలో చేర్పించేందుకు వీలుగా అధికారులు లక్నో ఆస్పత్రి– అమౌసీ ఎయిర్‌పోర్టు, ఢిల్లీ ఎయిర్‌పోర్టు– సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి మార్గాల్లో గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఏడాది క్రితం ఆమెను రేప్‌ చేసి, అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై వచ్చిన వ్యక్తి కావడం ఆశ్చర్యపరిచే అంశం.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం తన ఇంటివద్దనే ఉన్న మలుపు వద్దకు చేరుకున్నప్పుడే దాడికి దిగారని తెలిపింది. నిప్పంటించిన తరువాత కొద్ది దూరం పరుగులు తీసింది. ఈ లోగా ఇతరులు వచ్చి పోలీసులకు చెప్పారని వెల్లడించింది. ఇప్పుడు తిరిగి మరోసారి బాధితురాలిగా మారిన యువతి పై 2017లో అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 17 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆమె తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వ్యక్తి బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెనెగర్.

అయితే ఘటన జరిగిన ఏడాదికి కేసు దాఖలు అయింది. విచారణక్రమంలో ఈ ప్రాంతంలో బాధితురాలు కుటుంబ సభ్యులు అనేక సార్లు వేధింపులకు గురయ్యారు. బాధితురాలిపై నిప్పంటించిన ఘటన గురించి తెలియగానే గురువారం రాజ్యసభలో ఈ విషయంపై భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీనితో సభ కార్యకలాపాలు అరగంటసేపు నిలిచిపొయ్యాయి. ఎస్‌పి, కాంగ్రెస్ ఇతర సభ్యులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై, యుపిలోని బిజెపి సర్కారుపై విరుచుకుపడ్డారు.

గత ఏడాది డిసెంబర్‌లో తనపై జరిగిన అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ దయాశంకర్‌ ఎదుట బాధితురాలు వాంగ్మూలమిచ్చారు. 4.30 గంటలపుడు తన ఇంటి దగ్గర్లోని గౌరా మలుపు వద్ద హరిశంకర్‌ త్రివేది, రామ్‌కిశోర్‌ త్రివేది, ఉమేష్‌ బాజ్‌పాయ్, శివం త్రివేది, శుభం త్రివేదిలు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించినట్లు పేర్కొన్నారు. వీరిలో శివం, శుభం 2018 డిసెంబర్‌లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించగా ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా మరొకరు నవంబర్‌ 25న బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలిపై జరిగిన దాడి ఘటన రాజ్యసభలో దుమారం రేపింది. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఘటనను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య ఖండించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న హింసకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ రేఖా శర్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందించాలని, బాధితురాలికి సరైన వైద్యం అందించాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌(Chief Minister Yogi Adityanath) అధికారులను ఆదేశించారు. ఉన్నావ్‌ బాధితురాలిపై హత్యాయత్నంపై 12వేల మంది ట్విట్టర్‌లో ఆగ్రహం వెలిబుచ్చారు. రేపిస్ట్‌లు బెయిలుపై దర్జాగా తిరగడాన్ని కొందరు తప్పుబట్టారు.