
Lucknow, July 22: యూపీలో దారుణం చోటు చేసుకుంది. తండ్రీకూతుళ్లు కలిసి బంగారం షాపులోకి దూరి నగల చోరీకి (Father-Daughter Duo Steal Jewellery) పాల్పడ్డారు. జ్యుయలరీ షో రూమ్ సిబ్బంది కంట్లో కారం చల్లి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సిహాని గేట్ ప్రాంతంలోని ఒక జ్యుయలరీ షాపునకు తండ్రీ, కుమార్తె వెళ్లారు. కస్టమర్ల మాదిరిగా వారిద్దరూ బిల్డప్ ఇచ్చారు. గోల్డ్ చెయిన్ల కొనుగోలు కోసం అక్కడి సిబ్బందితో మాట్లాడారు. కుమార్తె పక్కనే కూర్చోగా ఆ వ్యక్తి గోల్డ్ చెయిన్‌ను తన మెడలో వేసుకుని ముందున్న అద్దంలో చూసుకున్నాడు.
అనంతరం అతడి మెడలోని గొలుసును తీసేందుకు సిబ్బంది సహకరించారు. కాగా, కుమార్తె ఉన్నట్టుండి తన చేతిలోని కారాన్ని (Chilli Powder Attack) సిబ్బంది ముఖంపై చల్లింది. మరోవైపు ట్రేలోని బంగారు నగలను ఆ వ్యక్తి లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు.
సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే సిబ్బందిలో ఒకరు ఆ మహిళ వేసుకున్న టీ షర్టు కాలర్‌ను గట్టిగా పట్టుకుని పారిపోకుండా నిలువరించారు. దీంతో ఆ వ్యక్తి కుమార్తె వారికి చిక్కింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.