![](https://test1.latestly.com/wp-content/uploads/2021/10/Uthra-and-Husband-Suraj.jpg)
Kollam, October 13: పామును వదలడం ద్వారా భార్య ఉత్రాను హతమార్చిన కేసులో (Uthra Murder Case) నిందితుడు సూరజ్‌ను సోమవారం దోషిగా తేల్చిన కేరళలోని కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు బుధవారం జీవిత ఖైదు శిక్ష(Kerala Court Awards Life Sentence) విధించింది. చార్జిషీటు చదివి వినిపించిన తర్వాత నిందితుడు మాట్లాడుతూ తాను చెప్పడానికి ఏమీ లేదని కోర్టుకు తెలిపాడు. కోర్టుకే నిర్ణయాన్ని వదిలేసాడు. క్రూరమైన నేరానికి పాల్పడిన సూరజ్‌కు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించింది. అయితే యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
సూరజ్ దోషిగా తేలడంపై శిక్ష పడటంపై ఉత్రా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దర్యాప్తు బృందానికి, ప్రాసిక్యూషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా 25 ఏళ్ల ఉత్రాను హత్య చేసేందుకు సూరజ్ దారుణమైన పథకం ఆలోచించాడు. హత్య చేసినా దొరక్కుండా ఉండేందుకు నాగుపామును ఎంచుకున్నాడు. మొదటి ప్రయత్నంలో విఫలం కావడంతో రెండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. తొలిసారి పాము కాటు నుంచి బతికి బయటపడిన ఉత్రా రెండోసారి మాత్రం తప్పించుకోలేకపోయింది. గతేడాది మే 7న ఉత్రా ఆంచల్‌లోని తన ఇంట్లో పాముకాటుతో (Killing Wife Using Cobra) మరణించింది.
పాములు అందించిన వ్యక్తికి సూరజ్ రూ. 10 వేలు చెల్లించాడు. పాములు అందించిన వ్యక్తి ఆ తర్వాత అప్రూవర్‌గా మారిపోయాడు. కేసును దర్యాప్తు చేసిన అధికారులు సూరజ్ కుట్రను బయటపెట్టేందుకు పాము డీఎన్ఏను కూడా పరీక్షించారు. కచ్చితమైన ఆధారాలు సేకరించేందుకు డమ్మీ ట్రయల్ నిర్వహించారు. డమ్మీ చేతిపై కాటుతో నిర్ధారణ చేసుకున్నారు. చివరికి ఉత్రాను చంపింది సూరజేనని తేల్చారు. అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. తాజాగా యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.