ఫిరోజాబాద్, జనవరి 23: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జనవరి 22న తన బిడ్డకు జన్మనిచ్చిన ఓ ముస్లిం మహిళ (Muslim Woman in Firozabad) అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ రోజున జన్మించినందున తన నవజాత శిశువుకు రామ్ రహీమ్ (Baby Ram Rahim) అని పేరు పెట్టారు. ఫర్జానా అనే మహిళ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చినట్లు జిల్లా మహిళా ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు. బిడ్డ, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారు" అని డాక్టర్ జైన్ చెప్పారు. పిల్లవాడి అమ్మమ్మ హుస్నా బాను అతనికి రామ్ రహీమ్ అని పేరు పెట్టింది," అన్నారు.
హిందూ-ముస్లింల ఐక్యత సందేశం ఇచ్చేందుకే బిడ్డకు రామ్ రహీమ్ అని పేరు పెట్టినట్లు బాను తెలిపారు. సోమవారం అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత దేశం మొత్తం ఉత్సాహంగా జరుపుకుంది.అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. లక్షలాది మంది దేశప్రజలు దీపాలు వెలిగించి, భజనలు పాడుతూ వేడుకలు జరుపుకున్నారు.
రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్ణయించిన ముహూర్తం దివ్యమైందనే భావనతో దేశవ్యాప్తంగా పలువురు గర్భిణీలు పట్టుబట్టి సిజేరియన్ చేయించుకున్నారు. కొంతమందికి మాత్రం ముహూర్త సమయానికే నార్మల్ డెలివరీ అయింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోనే సోమవారం 25 మంది గర్భిణిలు ప్రసవించారు. వీరిలో 10 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు వున్నారని.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అబ్బాయిలకు రాముడి పేరు, అమ్మాయిలకు సీత పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నారని వైద్యులు చెప్పారు.