యూపీలోని గౌతం బుద్ధ నగర్ జిల్లాలో జేవార్‌లో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి (Noida International Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 1,330 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. దీన్ని 2024 నాటికి పూర్తి చేయనున్నారు.
ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి. కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం (BJP Govt) చేసిన వాగ్దానాలలో విమానాశ్రయం ఒకటి.
శంకుస్థాపనకు ముందు ఎయిర్ పోర్ట్ డిజైన్ విశేషాలను మోదీకి నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. తొలి దశలో రూ.10,050 కోట్లతో దీని పనులు చేపట్టారు. 2024 సెప్టెంబర్/అక్టోబర్ నాటికి పూర్తి కానున్న ఈ విమానాశ్రయం ఏడాదికి 1.2 కోట్ల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఢిల్లీఎన్ సీఆర్ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం కాగా ఉత్తరప్రదేశ్ లో ఐదవది. ఇది పూర్తయితే దేశంలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా యూపీ నిలవనుంది.
ఇప్పటికే అక్కడ కుషీ నగర్ ఎయిర్ పోర్టు, అయోధ్య ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఢిల్లీ వారణాసి హై స్సీడ్ రైలు కనెక్ట్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఢిల్లీ నుంచి కేవలం 21 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునే విధంగా ఈ రైలు కనెక్టివిటీ ఉండనుంది. అలాగే సున్నా శాతం ఉద్గారాలు ఉన్న విమానాశ్రయంగా కూడా దీన్ని తీర్చి దిద్దనున్నారు.