ఉత్తర్ ప్రదేశ్ కౌషంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిందన్న అక్కసుతో అత్యాచార బాధితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై (ఇపుడు 19ఏళ్ల యువతి) లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపాడు.
యూపీ పోలీసులు అందించిన వివరాల ప్రకారం మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన కేసులో పవన్ నిందితుడు. బాధితురాలి (ఇపుడు హత్యకు గురైన) యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే అప్పటినుంచి కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధిత కుటుంబాన్ని, యువతిని ఆ నిందితుడు వేధిస్తూనే ఉన్నాడు.దీనికి వారు ఒప్పుకోకపోవడంతో మరింత కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్‌పై వ చ్చిన పవన్ ఆమెను హత మార్చేందుకు పథకం వేశాడు.
అతనికి మరో హత్య కేసులో నిందితుడిగా జైలుకెళ్లిన అతని సోదరుడు అశోక్ నిషాద్ కూడా బయటి కొచ్చి తోడయ్యాడు. దీంతో ఇద్దరూ కలిసి మళ్లీ బెదిరింపులకు దిగారు. అయితే అధి ఫలించకపోవడంతో పథకం ప్రకారం బాధిత యువతి పశువులను మేపేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా దాడి చేశారు. అతి దారుణంగా వెంటాడి, వేటాడి గొడ్డలితో నరికి చంపేశారు.
ఘటన చూసిన స్థానికులు సైతం భయాందోళనకు లోనయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. నిందితులను అరెస్టుకు బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు.