Uttarakhand Glacier Burst: ఉత్త‌రాఖండ్‌లో మళ్లీ హిమపాతం పేలుడు, 8 మంది మృతి, మరో ఆరుగురి ప‌రిస్థితి విష‌మం, కొనసాగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్, ఏరియల్ స‌ర్వే నిర్వహించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్
Uttarakhand Glacier Burst (Photo Credits: PTI)

Chamoli, April 24: ఉత్త‌రాఖండ్ రాష్ట్రం చ‌మోలీ జిల్లాలో గ‌త ఫిబ్ర‌వ‌రిలో సంభ‌వించిన హిమ‌పాతం తాలూకూ విషాదాన్ని పూర్తిగా మ‌రిచిపోక‌ముందే మ‌రో హిమ‌పాతం సంభవించింది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లోని చ‌మోలీ జిల్లాలోని నీతి వ్యాలీలోని సుమ్నా ( Sumna) గ్రామంలో భారీ హిమ‌పాతం (Uttarakhand Glacier Burst) సంభవించింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మంది మృతి చెందారు. అధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా మంచు కరిగడంతో భారీగా మంచు పెల్ల‌లు విరిగిప‌డి (Glacier Burst in Uttarakhand) ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే చ‌మోలీ జిల్లా అధికార యంత్రాంగం, ఆర్మీ అధికారులు, బార్డ‌ర్ రోడ్ ఆర్గ‌నైజేష‌న్ అధికారులు రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. హిమ‌పాతంలో చిక్కుకున్న వారిని ర‌క్షించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 384 మందిని హిమ‌పాతం నుంచి ర‌క్షించిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ అధికారులు తెలిపారు.

దేవభూమిలో అసలేం జరిగింది? మృత్యుఘోషకు కారణాలు ఏంటీ? ఇంకా కానరాని 170 మంది ఆచూకి, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఉత్తరాఖండ్ విలయంపై ప్రత్యేక కథనం

వారిలో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్నారు. మ‌రో 8 మృతదేహాల‌ను ఘ‌ట‌నా ప్రాంతం నుంచి వెలికి తీశామ‌ని చెప్పారు. సహాయ‌క చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని, రెస్క్యూ ఆప‌రేష‌న్ పూర్తి కావ‌డానికి మ‌రో మూడు నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చున‌ని అధికారులు తెలిపారు.

ఉత్త‌రాఖండ్‌లో హిమ‌పాతం సంభ‌వించిన ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇవాళ‌ ఏరియల్ స‌ర్వే నిర్వ‌హించారు. భారీగా మంచుకుర‌వ‌డంతో శుక్ర‌వారం సాయంత్రం మంచు దిబ్బ‌లు విరిగిప‌డిన ప్రాంతాన్ని ఆయ‌న హెలిక్యాప్ట‌ర్‌లో వెళ్లి ప‌రిశీలించారు. అనంత‌రం అధికారుల‌తో మాట్లాడి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.