Automobile Scrapping Policy: డొక్కు వాహనాలను తీసేయండి, కొత్త వాహనాలు కొనేటపుడు రాయితీలు పొందండి! నూతన ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
Traffic Representational Image (Photo Credits: PTI)

New Delhi, August 13: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం 'నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీ'ని వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ విభాగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ సమిట్లో ఆయన మాట్లాడారు. అంకుర సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆటో మొబైల్ స్క్రాపేజ్ పాలిసీ దేశంలో ప్రయాణ రంగానికి, ఆటో సెక్టారుకు ఒక సరికొత్త గుర్తింపును ఇవ్వనుందన్నారు. ఈ విధానం ద్వారా కాలం చెల్లిన మరియు ఉపయోగంలో లేనటువంటి వాహనాలను ఒక శాస్త్రీయ పద్ధతిలో తొలగించి, కొత్త వాహనాల కొనుగోలు సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజల ఆధునిక రవాణాను మెరుగుపరుస్తుంది, ప్రయాణ భారాన్ని తగ్గిస్తుంది మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయకారిగా ఉంటుందని మోదీ అన్నారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించాలన్న ఉద్యమంలో నూతన స్క్రాపింగ్ విధానం ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధానం ద్వారా రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను మరియు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది మోదీ వెల్లడించారు.

ఆటోమొబైల్ స్క్రాపింగ్ విధానం ద్వారా సాధారణ ప్రజానీకం ఎంతగానో లబ్ధి పొందనుంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రజలు తమ వాహనాన్ని తొలగించాలనుకుంటే వారికి ఇకపై ప్రభుత్వం తరఫున ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికెట్ పొందిన వారు మళ్లీ ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. దీనితో పాటు రోడ్డు ట్యాక్స్ లో కూడా కొంత రాయితీ ఇవ్వబడుతుందనిప్రధాని వివరించారు. దీంతో వాహనదారులకు వారి పాత వాహనాల నిర్వహణ వ్యయం భారం తగ్గుతుంది మరియు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదు, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గించిన వారవుతారని ప్రధాని మోదీ స్క్రాపింగ్ పాలసీ ప్రయోజనాలను వివరించారు.

ప్రస్తుతం దేశం క్లీన్, కంజెశన్ ఫ్రీ, మొబిలిటి దిశలో పయనిస్తున్న కాలంలో పాత వైఖరిని, పాత అభ్యాసాలను మార్చుకోవలసిన ఆవశ్యకత ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ పౌరులకు ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన రవాణా సురక్షతను మరియు నాణ్యతను అందించడానికి ప్రభుత్వం కంకణబద్దంగా ఉందని,బిఎస్-4 నుంచి బిస్6 కు మళ్లడం వెనుక ఉన్న ఆలోచన విధానం ఇదే అని చెబుతూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.