New Delhi, May 24: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓటరు ఓటింగ్‌కు సంబంధించిన ప్రామాణీకరణ రికార్డును వెల్లడించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి మధ్యంతర ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.పోలింగ్ జరిగిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న అంశంపై బూత్ ఓటర్ల డేటాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఏడీఆర్ ఎన్జీవో సంస్థ పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు ఎస్సీ శర్మలతో కూడిన ధర్మాసనం ఆ అభ్యర్థనపై తాత్కాలిక ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ వెబ్‌సైట్‌లో ఫారమ్ 17సీ డేటాను అప్‌లోడ్ చేయాలన్న అప్లికేషన్‌ను కొట్టివేసింది. బూత్ డేటాను అప్‌లోడ్ చేయడం వల్ల ఓటర్లు అయోమయంలో పడే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్ కుమార్ మీనా
ఫారమ్ 17సీకి చెందిన సమాచారాన్ని కేవలం అభ్యర్థికి లేదా అతని ఏజెంట్‌కు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే అంశంపై మరో పిటీషన్ కూడా 2019 నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టు ధర్మాసనం తెలిపింది. 2019లో దాఖలైన పిటీషన్‌లో ని ఏ భాగం, 2024 అప్లికేషన్‌కు చెందిన బీ భాగం రెండూ ఒక్కటే అని, అందుకే ఈ కేసులో ఎటువంటి తాత్కాలిక రిలీఫ్ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
2019 లోకసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ శాతం అవకతవకలు జరిగినట్లుగా ఒక్క అభ్యర్థి గానీ, ఒక్క ఓటర్ గానీ పిటిషన్ వేయలేదని గుర్తు చేసింది. ప్రస్తుత పిటిషన్ ఆధారం లేని తప్పుడు పిటిషన్ అని పేర్కొంది. వేసవి సెలవుల తర్వాత విచారణ కోసం ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.