New Delhi, Nov 30: భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యా (Vijay Mallya) కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించేందుకు ఇక వేచి ఉండలేమని.. కోర్టు ధిక్కారం కేసులో మాల్యాకు విధించదగిన శిక్షను (Supreme Court to decide punishment) వచ్చే ఏడాది జనవరి 18న ఖరారు చేస్తామని మంగళవారం జస్టిస్ యూ.యూ.లలిత్ నేతృత్వంలో త్రిసభ్య సుప్రీం (Supreme Cour) ధర్మాసనం పేర్కొంది.
అప్పటికల్లా విజయ్ మాల్యా స్వదేశానికి తీసుకొస్తారా.. లేదా.. అన్న అంశంతో నిమిత్తం లేకుండా విచారణ ప్రారంభం కానున్నదని తెలిపింది. స్వదేశానికి మాల్యా తీసుకొచ్చేందుకు దర్యాప్తు సంస్థలకు తగినంత సమయం ఇచ్చామని, ఇక వేచి ఉండలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. విజయ్ మాల్యా తన వాదనను వినిపించేందుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోతే ఆయన తరఫు న్యాయవాది సమక్షంలోనే శిక్ష ఖరారు చేయనున్నది.
ఇప్పటికే విజయ్ మాల్యా కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డాడని జస్టిస్‌లు యూయూ లలిత్, ఎస్ రవీంద్రభట్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. కరోనా మహమ్మారి వేళ ఈ కేసు విచారణ పదేపదే వాయిదా పడటంతో జాప్యమైందని విదేశాంగశాఖ అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపింది. భారత్‌కు విజయ్ మాల్యా అప్పగింత ప్రక్రియ బ్రిటన్‌లో చివరి దశకు చేరుకున్నదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. అయితే కొన్ని చట్ట పరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని, అవి రహస్యం కావడంతో వివరాలు తెలియడం లేదని పేర్కొన్నది. ఒక క్రిమినల్ గైర్హాజరీలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి చట్టంలో ఎటువంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం తెలిపింది.
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణాల ఎగవేతకు పాల్పడినట్లు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయ్ మాల్యకు వ్యతిరేకంగా ఎస్బీఐ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బ్రిటన్‌లో విజయమాల్య అప్పగింత ప్రక్రియ కొనసాగుతున్నందున విచారణకు మరికొంత టైం ఇవ్వాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.
బ్రిటన్ నుంచి మాల్యాను భారత దేశానికి రప్పించే ప్రక్రియ చివరి దశలో ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొన్న ఓ నోట్ ను కోర్టుకి సొలిటర్ జనరల్ తుషార్ మొహతా సమర్పించారు. మాల్యాను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, అయితే ఈ తీర్పును అమలు చేయడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ కోర్టుకి తెలిపింది. కొన్ని రహస్య కార్యకలాపాలు బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని ఆ నోట్ లో పేర్కొంది.
కాగా,భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2016లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బ్రిటిష్ లిక్కర్ దిగ్గజ కంపెనీ డియాజియో స్వీకరించిన 40 మిలియన్ డాలర్లను(రూ.600కోట్లు) కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు బదిలీ చేశారని, ఇది వివిధ కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని, ఈ కన్సార్షియం ఆరోపించింది.
ఈ క్రమంలో మాల్యా తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించడంలో విఫలమయ్యాడని, బ్రిటీష్ కంపెనీ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్ల గురించి వెల్లడించకుండా ఉద్ధేశపూర్వకంగా అవిధేయత చూపినందుకు ధిక్కార నేరానికి పాల్పడ్డాడని మే-9,2017న సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ మూడేళ్ల నుంచి కోర్టు మాల్యాకు శిక్ష ఖరారు విషయంలో అతని వ్యక్తిగత హాజరు కోసం ఎదురుచూసింది. కాగా, అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ గతేడాది నవంబర్ లో మాల్యా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా కోర్టు ధిక్కారణ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ మాల్యా న్యాయస్థానంలో హాజరుకాలేదు.