Wayanad Landslide

వాయనాడ్, జూలై 30: కేరళ (Kerala)లోని జిల్లా ప్రకృతి ప్రకోపానికి బలైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద తిరిగిరాని లోకాలకు వెళ్ళాయి. వయనాడ్‌ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 123 మంది మృతి చెందినట్లు రాష్ట్ర రెవెన్యూ కార్యాలయం వెల్లడించింది. అలాగే 128 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

కేరళలో సంభవించిన ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా ఇది నిలిచింది. కొండచరియలు విరిగిపడిన తరువాత, తమ ఇళ్లలో చిక్కుకుపోయి లేదా ఒంటరిగా ఉన్న ప్రదేశాల నుండి బయటకు వెళ్లడానికి మార్గం లేకుండా చాలా మంది ప్రజలు ఏడుస్తూ మరియు రక్షించమని వేడుకున్న హృదయాలను కదిలించే దృశ్యాలు మరియు ఫోన్ సంభాషణలు చూశాయి. నిన్న రాత్రి నిద్రకు ఉపక్రమించిన చిన్నారులు, పసిపాపలతో సహా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఇప్పుడు భూమికింద సమాధి అయ్యారు. వరదల కారణంగా అనేక మంది ప్రజలు గల్లంతయ్యారు. మలప్పురం జిల్లా పోతుకల్లులోని చలియార్ నదిలో 16 మంది మృతదేహాలను వెలికితీశారు.  వయనాడ్ ప్రళయంలో కేరళకు అండగా తమిళనాడు సీఎం స్టాలిన్, తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు

తొలుత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడ్డాయి. సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.సహాయక చర్యలు కొనసాగుతుండగానే తెల్లవారుజామున 4 గంటలకు ఈ స్కూల్‌ సమీపంలో మరోసారి కొండచరియలు పడ్డాయి.

కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే నాలుగు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి.కొండచరియల పడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్‌మలలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది.అత్తమాల, నూల్‌పుజా గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.   వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్

వరద, బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నారు. డ్రోన్లు, జాగిలాలతో అన్వేషణ సాగిస్తున్నారు. మరోవైపు, వయనాడ్‌ విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

రెస్యూ ప్రయత్నాల్లో భాగంగా సెకండ్-ఇన్-కమాండ్ కింద ఒక మెడికల్ అధికారి, ఇద్దరు జేసీఓలు, 40 మంది జవాన్లను మోహరించినట్టు డిఫెన్స్ పీఆర్ఓ తెలిపారు. కొండచరియలు విరిగిపడిన వయనాద్‌లోని చూరల్‌ మాల ప్రాంతంలో ఐఏఎఫ్‌ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగడంతో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతమైంది. శిధిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను గుర్తించేందుకు శ్రమిస్తున్నారు.

300 మంది సిబ్బందితో భారత ఆర్మీ బలగాలను వెంటనే రంగంలోకి దింపినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అదనపు ఆర్మీ బలగాలు, నేవీ సిబ్బంది, వాయిసేన హెలికాప్టర్లను సమీకరించామని చెప్పారు. భారీ ఇంజనీరింగ్ సామాగ్రి, డాగ్ టీమ్‌లు, నిత్యావసరాలను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా త్రివేండ్రం, బెంగళూరు, ఢిల్లీ నుంచి పంపిస్తున్నట్టు వివరించారు.

వయనాడ్ విలయం నుంచి కేరళను ఆదుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సాయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. కేరళ బ్యాంక్ ఇప్పటికే సీ ఎండీఆర్ఎఫ్ కోసం రూ.50 లక్షలు కంట్రిబ్యూట్ చేసిందని, సిక్కిం ముఖ్యమంత్రి రూ.2 కోట్లు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ.5 కోట్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజుల సంతాప దినాలు ప్రకటించామని, పబ్లిక్ ఈవెంట్లు, ఉత్సవాలు నిషేధించామని తెలిపారు. సంతాప దినాల్లో జాతీయ పతకాన్ని 'హాఫ్-మాస్ట్' చేయాలని ప్రజలను కోరారు.