Kaliaganj, June 15: పశ్చిమ బెంగాల్‌లో అంబులెన్సుకు చెల్లించేందుకు డబ్బులు లేక (Unable to Pay for Ambulance Services) ఓ వ్యక్తి తన కుమారుడి శవంతో 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా కలియగంజ్ ప్రాంతం డంగిపారా గ్రామానికి చెందిన ఈ వ్యక్తి పేరు ఆసిం దేవశర్మ. ఐదు నెలల క్రితమే కవలలకు తండ్రయ్యాడు.
అయితే ఇటీవలే వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు రాయ్‌గంజ్ మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వీరు మాత్రం సిలీగుడిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
కల్తీమద్యం తాగి 12 మంది మృతి.. డజనుకు పైగా దవాఖానపాలు.. తమిళనాడులో ఘోరం
కానీ పిల్లల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇంకా క్షీణించింది. దీంతో కవలల్లో ఒకరిని తీసుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆస్పత్రి నిర్వాహకులను అడిగాడు దేవశర్మ. అయితే రూ.8,000 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. అంబులెన్సు రోగులను తరలించేందుకే ఉచితమని, శవాలను తరలించేందుకు కాదని బదులిచ్చాడు.
కుమారుల చికిత్స కోసం ఆరు రోజుల పాటు రూ.16,000 ఖర్చు చేయడంతో దేవశర్మ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇక గత్యంతరం కుమారుడి మృతదేహాన్ని ఓ బ్యాగులో పెట్టుకుని (Man Carries Son's Body Back Home in Bag) సిలీగుడిలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాయ్‍గంజ్‌లో దిగాడు. అక్కడినుంచి కలియగంజ్ వెళ్లేందుకు మరో బస్సు ఎక్కాడు. మొత్తం రూ.200 కిలోమీటర్లు ప్రయాణించాడు. చిన్నారి చనిపోయాడని తెలిస్తే బస్సు నుంచి దింపేస్తారని భయంతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు.
కలియగంజ్ చేరుకున్నాక తెలిసిన వ్యక్తి ఒకరు అంబులెన్సు ఏర్పాటు చేయడంతో దేవశర్మ అందులోనే ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించాడు. తనకు జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.