New Delhi, May 29: దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను (Aadhar) ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు (SIM Card) నుంచి బ్యాంక్ ఖాతాల (Bank Accounts)వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్‌డ్ కాపీ’లను (Masked Copy) మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం (Mis use) చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్‌డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది.
మాస్క్‌డ్ ఆధార్ కాపీ అంటే
భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్‌లైన్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్‌డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది.
మాస్క్‌డ్ ఆధార్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
1. https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, 'డౌన్‌లోడ్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి.
2. మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. మాస్క్‌డ్ ఆధార్ కావాలి.. అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. ధృవీకరణ కోసం అందించబడే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
5. ‘Send OTP’పై క్లిక్ చేయండి.
6. ఇ-ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత PDF కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
7. ఆధార్ PDF పాస్‌వర్డ్ 8 అక్షరాలలో ఉంటుంది.(మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (ఆధార్‌లో ఉన్నట్లు) క్యాపిటల్ అక్షరాలు, YYYY ఆకృతిలో పుట్టిన సంవత్సరంతో ఎంటర్ చేయాలి.)