New Delhi, AUG 21: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో (Manish Sisodia) పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు (Foreign Travel Ban) విధించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (CBI) అధికారులు ఇటీవల సోదాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులోనే సీబీఐ దాడులు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో (FIR) మొత్తం 15 మంది పేర్లను పేర్కొన్నారు. వారిలో 13 మందికే ఇవాళ లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర దర్యాప్తు బృందం (CBI) తనకు లుకౌట్ నోటీసు పంపించడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)స్పందించారు. ‘మీరు చేసిన దాడులు అన్నీ విఫలమయ్యాయి. దాడుల్లో మీకు ఏమీ దొరకలేదు. ఒక్క రూపాయి కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు మీరు లుకౌట్ నోటీసు జారీ చేశారు. నేను కనపడట్లేనని అంటున్నారు. మోదీజీ ఏమిటీ ఈ గిమ్మిక్కు. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. నేను ఎక్కడున్నానో తెలియట్లేదా? నేను ఎక్కడికి రావాలో చెప్పండి మోదీ జీ’ అని మనీశ్ సిసోడియా ట్వీట్లు చేశారు.
आपकी सारी रेड फैल हो गयी, कुछ नहीं मिला, एक पैसे की हेरा फेरी नहीं मिली, अब आपने लुक आउट नोटिस जारी किया है कि मनीष सिसोदिया मिल नहीं रहा। ये क्या नौटंकी है मोदी जी?
मैं खुलेआम दिल्ली में घूम रहा हूँ, बताइए कहाँ आना है? आपको मैं मिल नहीं रहा?
— Manish Sisodia (@msisodia) August 21, 2022
దేశంలో ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ ను (Kejriwal) అడ్డుకునేందుకే మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ బీజేపీ హడావుడి చేస్తోందని మనీశ్ సిసోడియా కూడా ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు బృందం (CBI) లేదా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు తనను మూడు-నాలుగు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రద్దుచేసి, పాత విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా ఇంటిపై దాడులు జరగడం గమనార్హం.