When former President Abdul Kalam got a hotline call just before Agni missile launch!

Mumbai, October 15: అబ్దుల్ కలాం.. మిస్సైల్ టెక్నాలజీలో ఈ పేరు ఓ వైబ్రేషన్.. బుడి బుడి అడుగుల భారత పరిశోధన శక్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మిస్సైల్ మ్యాన్ కలాం పేరు భారత అణురంగంలో ఓ చెక్కు చెదరని సంతకం. తరతరాలు గుర్తించుకునే ఓ మహోత్తర శక్తి. అణు, స్సేస్ రంగంలో ప్రపంచ దేశాలకు భారత్ సవాల్ విసురుతోందంటే అది అబ్దుల్ కలాం చలవేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఓ వైపు అమెరికా, మరోవైపు చైనా వరుసగా అణుపరీక్షలు నిర్వహించుకుంటూ మన దేశాన్ని కించపరుస్తున్న కాలంలో అబ్దుల్ కలాం అనే వేగు చుక్క ఇండియాకు దారి చూపింది. సైకిల్ మీద రాకెట్‌ను తీసుకెళ్లి ప్రపంచ దేశాలకు ధీటుగా స్పేస్ టెక్నాలజీని పరుగులు పెట్టించింది. ఈ రోజు కలాం జయంతి. ఆయన గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు. అందరి గుండెల్లో ఆయన చిత్రం దాగి ఉంది. అయితే కలాం హాట్ లైన్ కాల్ గురించి చాలామందికి తెలియదు. అదేంటో ఓ సారి తెలుసుకుందాం.

భారత పరిశోధన శక్తిని ఖండాతరాలకు చాటి చెప్పిన అస్త్రం అగ్ని విషయంలో అగ్రరాజ్యం అమెరికా కొన్ని కుతంత్రాలకు తెరలేపింది. అగ్నిని ఆపాలని అప్పుడు మన మిస్సైల్ మ్యాన్ కలాంకు ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయని కలాం తన పుస్తకంలో స్వయంగా వెల్లడించారు. దీనికి కారణం అమెరికా  కుతంత్ర నీతి అని చెప్పవచ్చు. దేశ పతాకాన్ని ప్రపంచదేశాల పక్కన సగర్వంగా నిలపాలనే తపన, పట్టుదలతో మిస్సైల్ మ్యాన్ ఆ ఫోన్ కాల్ ఒత్తిళ్లకు లొంగలేదు. కలాంకు వచ్చిన ఆ హాట్ లైన్ కాల్ (Kalam Hotline call)ను అబ్దుల్ కలాం ఎత్తి ఉంటే మన దేశ తలరాత మరో విధంగా ఉండేది.

1989వ సంవత్సరం నాటి సంఘటన అది.

మూడో ప్రయోగం కోసం బాలాసోర్ లో 72 గంటల పాటు సైట్ లోనే కలాం జీవితాన్ని గడుపుతున్నారు. అప్పటికే రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి తినడానికి తిండి కూడా సరిగ్గా తిండిలేదు. ఎప్పుడూ కూల్ గా ఉండే కలాం ఆరోజు ఎంత టెన్సన్ పడ్డారో అక్కడున్న వారిని అడిగితే తెలుస్తుంది. రెండు ప్రయోగాలు విఫలమవడంతో అందరూ ఆయన్ని హేళనగా చూస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందా లేదా అన్న సందేహం ఆయన్ని అణుక్షణం చిత్రవధ చేస్తోంది. వీటిని తట్టుకోలేక ఈ ప్రయోగం ఫెయిల్ అయితే నేను శాశ్వతంగా పరిశోధన రంగం నుంచి నిష్క్రమిస్తానంటూ అప్పటికే శపధం కూడా చేశారు. సరిగ్గా అలాంటి సమయంలోనే అగ్రదేశాలు నుంచి ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ రాయబారాలు నడిపాయి. మనదేశం ఆయుధరంగంలో దూసుకుపోతుందని పసిగట్టిన అగ్రరాజ్యాలు ప్రయోగాన్ని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా కలాంపై ఒత్తిడి తెచ్చాయి.

అగ్ని’ క్షిపణి ప్రయోగానికి రెడీ అవుతున్న దశలో..

భారత్ ‘అగ్ని’ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. కొన్నిగంటల్లో ప్రయోగం జరుగుతుందనగా.. ఆరోజు వేకువజామున 3 గంటలకు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఇండియన్ మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఓ ఫోన్ వచ్చింది. ప్రయోగం ఎంతవరకు వచ్చింది? దాన్ని ఆపాలని అమెరికా, నాటో కూటమినుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది' అన్నది కాల్ సారాంశం. అప్పటికే కలాం డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ప్రయోగాన్ని ఆపే స్థితి దాటిపోయింది. ఇప్పుడేమీ చేయలేమని తెగేసి చెప్పారు. మరుసటిజు తెల్లవారాక ఒడిశాలోని చాందీపూర్ నుంచి అగ్నిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాలు కలాం చివరి పుస్తకం ‘అడ్వాంటేజ్ ఇండియా' లో ఉన్నాయి.

అది అత్యంత కీలక ఘట్టం

అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్ని ప్రయోగం అనేది అత్యంత కీలక ఘట్టం. 1989లో అగ్ని క్షిపణి పరీక్షించే సమయంలో ప్రయోగాన్ని ఆలస్యం చేయాలనే సందేశాన్ని హాట్‌లైన్ ఫోన్‌కాల్ ద్వారా కలాంకు ఆ సందేశాన్ని అందించింది ఎవరో కాదు..ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి క్యాబినెట్ కార్యదర్శి టీఎన్ శేషన్. ఈ విషయాన్ని అడ్వాంటేజ్ ఇండియా: ఫ్రం చాలెంజ్ టు అపర్చునిటీ అనే పుస్తకంలో కలాం స్వయంగా వెల్లడించారు. 1989 మే 22న అగ్ని ప్రయోగానికి కొద్దిగంటల ముందుగా ఉదయం 3 గంటలకు హాట్‌లైన్ ద్వారా టీఎన్ శేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌కాల్ పరమార్థం మంచిగా గోచరించలేదు అని పేర్కొన్నారు. నా జవాబు వినకుండానే అగ్ని ప్రయోగ కార్యక్రమంలో మనం ఏ దశలో ఉన్నాం. మనపై అమెరికా, నాటోల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. వారితో మనకు అనేక దౌత్యపరమైన ప్రయోజనాలున్నాయి . అగ్ని ప్రయోగాన్ని ఆలస్యం చేసే మార్గమేమైనా ఉందా? అని శేషన్ అడిగినట్లు అబ్దుల్ కలాం తెలిపారు.తాను జవాబు ఇచ్చేంతలోపే మరోసారి మళ్లీ అగ్ని ప్రయోగ ప్రక్రియలో మనం ఏదశలో ఉన్నామని అడిగారని తన పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రధాని, పీఎంవోపై తీవ్ర ఒత్తిడి

అగ్ని ప్రయోగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘావర్గాల సమాచారం తనకు అందిందని ప్రధాని, పీఎంవోపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నదనే విషయం తెలుసని కలాం అడ్వాంటేజ్ ఇండియాలో వెల్లడించారు.ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చండీపూర్ ప్రాంతాన్ని తుఫాన్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టే అవకాశాలున్నాయనే విషయం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు.

అగ్ని ప్రయోగానికి పదేండ్ల ముందే జట్టు ఎంపిక

కాగా అగ్ని ప్రయోగానికి పదేండ్ల ముందే జట్టు ఎంపిక జరిగింది. పరిమితమైన బడ్జెట్, సాంకేతిక సౌకర్యాలు అందకపోవడం, ఇతర దేశాల నుంచి తొలగింపులు, మీడియా ఒత్తిడి లాంటి అనేక అంశాలు, సమస్యలు ప్రాజెక్టుకు అడ్డంకిగా నిలిచాయి.ఇలాంటి సమస్యలన్నింటిని అధిగమించి.. అగ్ని క్షిపణి ప్రయోగాన్ని సాకారం చేసేందుకు మహిళలు, పురుషులతో కూడిన శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు అనే విషయం తన మదిలో మెదిలిందని తన పుస్తకంలో కలాం పేర్కొన్నారు.ఇలాంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే తన గొంతు సవరించుకొని సర్ ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షిపణి ప్రయోగం నిలిపివేసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రయోగాన్ని వాయిదా వేసుకోలేం. ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించారు అని చెప్పానని కలాం పేర్కొన్నారు.ఈ విషయంపై సుదీర్ఘమైన వాదన జరుగుతుందని భావించిన తనకు ఆశ్చర్యకరమైన రీతిలో ఒకే అయితే అలానే కానివ్వండి అని తన బాస్ శేషన్ ఉదయం 4 గంటల సమయంలో ఫోన్ పెట్టేశారని తెలిపారు.

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి అగ్ని

ఈ ఘటన అనంతరం మూడు గంటల తర్వాత 1989 మే 22న అగ్ని క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిని చీల్చుకుంటూ దూసుకుపోయింది.ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ చరిత్రను తిరగరాసింది. మరుసటి రోజున చండీపూర్‌లోని క్షిపణి ప్రయోగ వేదికను తుఫాన్ పాక్షికంగా దెబ్బతీసింది. అయితే అప్పటికే అగ్ని ప్రయోగాన్ని సఫలం చేశామని విజయగర్వంతో మేమంతా ఉన్నాం అని కలాం తన పుస్తకంలో పేర్కొన్నారు.ఆ ప్రయోగం విజయవంతంతోనే అగ్ని 1,2.3.4,5,6 ఇలా వరుసగా మన అస్త్రాలు ముందుకు వస్తున్నాయి. అగ్ని 7 కూడా త్వరలోనే మన ముందుకు రాబోతోంది. కలాం ఈ హాట్ లైన్ కాల్ కి తలొగ్గి ఉంటే భారత్ పరిశోధన రంగంలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనేది తెలుస్తుంది. దటీజ్ కలాం.

లేటెస్ట్‌లీ టీం తరపున మిస్సైల్ మ్యాన్‌ అబ్దుల్ కలాంకు జయంతి శుభాకాంక్షలు. (Happy birthday APJ Abdul kalam)