MHA says COVID-19 situation 'especially serious' in Mumbai, Pune, Kolkata, Jaipur, Indore (Photo-PTI)

New Delhi, July 16: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు (Coronavirus Cases in India) పెరిగిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కల్లోలాన్ని రేపుతోంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ల జాబితాలో ప్రపంచంలోనే భారత్‌ ( India Coronavirus) మూడోస్థానానికి చేరింది. దేశంలో 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) విధిస్తే కాని పరిస్థితులు అదుపులోకి వచ్చేలా కనబడటం లేదు. 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 24 గంటల్లో రికార్డు స్థాయిలో 29,429 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు, ఇప్పటివరకు 5,92,032 మంది డిశ్చార్జ్

కరోనాకు వ్యాక్సిన్‌, ఔషధం వచ్చేదాకా ఈ వైరస్ ని (COVID-19) కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ (Lockdown) ఒక్కటే మార్గమని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇక కేంద్రం ‘అన్‌లాక్‌ 2.0’ (Unlock 2.0) ప్రకటించినా లాక్‌డౌన్‌ విధింపే ఉత్తమ మార్గంగా భావిస్తున్నాయి. గతంలో విధించిన విడతల వారీ లాక్‌డౌన్ల కారణంగా కరోనా వ్యాప్తిని 2 నెలల పాటు అడ్డుకోగలిగామని, ఇప్పుడూ అదే నిర్ణయం ఉత్తమమని మెజార్టీ రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్‌లో 13 రోజుల్లో దాదాపు 15 వేల కరోనా కేసులు, జీహెచ్‌ఎంసీలో రోజుకు సగటున 1000 పాజిటివ్ కేసులు, ఈ నెలలో రికార్డు స్థాయిలో కోవిడ్-19 కేసులు

అది సాధ్యం కాకుంటే కొన్ని రాష్ట్రాలు, నగరాల వరకైనా లాక్‌డౌన్‌ను అమలు చేసి, వైర్‌సను కట్టడి చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ వైపు వెళ్లాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే..

గోవా లాక్‌డౌన్‌

గోవాలో వారంలో మూడు రోజుల పాటు లాక్డౌన్ మరియు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం ప్రకటించారు. కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, శుక్రవారం, శనివారం మరియు ఆదివారం లాక్ డౌన్ ప్రకటించినట్లు, రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ వర్తిస్తుందని చెప్పారు. నైట్ కర్ఫ్యూ ఆగస్టు 10 వరకు అమలు చేయబడుతుంది. మంగళవారం గోవాలో 170 కొత్త కేసులు నమోదయ్యాయి.

కేబినెట్ సమావేశం తరువాత లాక్డౌన్పై నిర్ణయం ప్రకటించారు. నైట్ కర్ఫ్యూ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ మరియు నైట్ షిఫ్టులలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే అనుమతించబడతారు. కర్ఫ్యూను ధిక్కరించిన వారిని అరెస్టు చేస్తామని సావంత్ తెలిపారు. కేసులు వేగంగా పెరిగినందున ఎక్కువ కాలం లాక్డౌన్ ప్రకటించాలని కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు సిఎంను కోరినట్లు ఒక వర్గాలు తెలిపాయి.

తమిళనాడులో లాక్‌డౌన్‌

దేశంలో కరోనావైరస్ కేసుల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానాన్ని తమిళనాడు ఆక్రమించింది. ఆ రాష్ట్రంలో సుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెన్నై సహా ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది.

మహారాష్ట్ర లాక్‌డౌన్‌

మహారాష్ట్రలోని పుణె నగరం ఆది నుంచి కరోనాకు హాట్‌స్పాట్‌గా ఉంది. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌కు ముందే అక్కడ కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుణె ప్రభుత్వం సోమవారం నుంచి లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌ను ఈ నెల 23 వరకు అమలు చేయాలని నిర్ణయించింది.

కేరళలో లాక్‌డౌన్‌

కేరళలోని తిరువనంతపురంలో ఈ నెల 6 నుంచి మూడంచెల లాక్‌డౌన్‌ అమలవుతోంది. అక్కడ మూడు అంచెల్లో లాక్‌డౌన్‌ అమలువుతోంది. ఈ నెల 23వ తేదీ వరకు అక్కడ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది

కర్ణాటక రాజధాని బెంగళూరులో వారంపాటు లాక్‌డౌన్‌

కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు నగరంలో మళ్లీ వారంపాటు లాక్‌డౌన్‌ను విధించింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే లాక్‌డౌన్‌ అమల్లోకి రాగా.. 22వ తేదీ వరకు కొనసాగనుంది. తాజా లాక్‌డౌన్‌ ప్రకటనతో సోమవారం ఉదయం నుంచి వేల సంఖ్యలో వలస కూలీలు బెంగళూరును వీడారు. ఇక ధర్వాడ, దక్షిణ కర్ణాటక జిల్లాల యంత్రాంగాలు కూడా బుధవారం నుంచి 9 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

ఉత్తరప్రదేశ్‌ లాక్‌డౌన్‌

ఉత్తరప్రదేశ్‌లో కరోనావైరస్ కట్టడికి వారాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. యూపీలో కేసులు భారీగా నమోదవుతుండటంతో యోగి సర్కారు వారాంతాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది.

బీహార్‌ లాక్‌డౌన్‌

బిహార్‌ సర్కారు కూడా మరోమారు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి 31 వరకు దీన్ని అమలు చేయనుంది. వలస కూలీల ద్వారా కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీ, తెలంగాణలో పలు ఆంక్షలు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి ప్రాంతాలుసహా రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపు వేళలను కుదించారు. నిత్యావసర, ఇతర దుకాణాల సమయాన్ని ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా తగ్గించి, జనసంచారంపై నియంత్రణ విధిస్తున్నారు. చాలా జిల్లాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతినిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇక కొవిడ్‌ కట్టడికోసం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.9%గా ఉంటుందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) అంచనావేసింది. పన్నుల రూపంలో రావాల్సిన రూ.7 వేల కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని తెలిపింది.

కేంద్రం ఆలోచన ఎలా ఉంది ?

ఈశాన్య రాష్ట్రాలు వంటి కొన్నింటిని మినహాయిస్తే మిగతా చోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కొన్ని నగరాల్లో వ్యాపారులే సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దీంతో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు మరోసారి లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అయితే కేంద్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసేదిశగా కేంద్రం అడుగులు పడుతున్నాయి. ఈ నెల 31 తరువాత విమానాలకు, సినిమా హాల్స్‌కు, జిమ్స్‌కు కూడా పర్మిషన్లు ఇవ్వాలనే వత్తిడి ప్రభుత్వం మీద ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో పరిమితులను సడలించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని అంతర్జాతీయ విమానాల్లోకి అనుమతించాలని అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లను ఎలా నడపాలనే విషయంపైనా కూడా చర్చలు నడుస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అనధికార సమాచారం ప్రకారం గరిష్టంగా 72 గంటల ప్రయాణానికి మాత్రమే అనుమతిస్తారు. ఎయిర్పోర్టులో దిగాక, వారి సొంత ఖర్చుతో కరోనా టెస్టులు చేయించుకోవాలి. 45 నిమిషాలపాటు పట్టే ఈ టెస్టుకు రూ.500 చెల్లించాలి. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ టెస్టింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. కరోనా పాజిటివ్ వస్తే సొంత ఖర్చులతోనే క్వారంటైన్లో ఉండాలి.ఎకానమీని సాధారణ స్థాయికి తీసుకురావడానికే రిస్ట్రిక్షన్లను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది.