New Delhi, July 15: దేశంలో గత పది రోజులుగా ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు నమోదవగా, 582 మంది మరణించారు. కరోనా బయటపడినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,19,840 యాక్టివ్ కేసులు ఉండగా, వైరస్ బారినపడినవారిలో 5,92,032 మంది బాధితులు కోలుకున్నారు. 75 మంది బీజేపీ నేతలకు కరోనా, మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు, కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ రాష్ట్ర ప్రభుత్వం
ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 24,309 మంది (Coronavirus Deaths) మరణించారు. జూలై 14 వరకు 1,24,12,664 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. నిన్న ఒకే రోజు 3,20,161 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 63.02 శాతంగా ఉంది.
దేశంలో 86 శాతం కరోనా పాజిటివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే బయటపడ్డాయని అన్నారు. దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్ రాజకీయాల్లో ఊహించని మలుపు, బీజేపీలో చేరేది లేదన్న సచిన్ పైలట్, ప్రభుత్వ మనుగడపై కొనసాగుతున్న సస్పెన్స్
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ వారంలోనే 10 లక్షల మార్కును దాటనుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ఇకనైనా కఠినమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్తను ఈ ట్వీట్‌తో జత చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.15 లక్షల కేసులు నమోదయ్యాయి. 5,311 మంది మృతిచెందారు. వరల్డ్‌మీటర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ ఒక కోటీ 34 లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా, మరణించిన వారి సంఖ్య ఐదు లక్షల 80 వేలు దాటింది. ఇప్పటివరకు 78 లక్షల మందికి పైగా ఈ వ్యాధి నుంచి కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనాకు అత్యధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 35 లక్షలకుపైగా జనం కరోనా బారిన పడ్డారు. ఒక లక్షా 39 వేలకుపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. బ్రెజిల్‌లో 1.9 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. బ్రెజిల్ తరువాత భారత్, రష్యాలలో కరోనా సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్‌లో ఒక లక్షా 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో గరిష్ట కేసుల సంఖ్య పరంగా భారత్ మూడవ స్థానానికి చేరుకోగా, అత్యధిక మరణాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.