COVID in India: భారత్‌లో మరోసారి ఉగ్రరూపం దాల్చిన కరోనావైరస్, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు, ఒక్క మహారాష్ట్రలోనే 31 వేలకు పైగా కేసులు నమోదు
Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

New Delhi, March 25: భారత్‌లో కోవిడ్19 సెకండ్ ఇన్నింగ్స్ కూడా భీకరంగా సాగుతోంది. ఒకరోజును మించి మరొకరోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం దేశంలోని రోజూవారీ కోవిడ్ కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది, గడిచిన 5 నెలల్లో ఇదే గరిష్ఠం. అయితే దేశంలో నమోదయ్యే కొత్త కేసుల్లో సింహ భాగం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. గడిచిన ఒక్కరోజులో మహారాష్ట్రలో 31,855 కేసులు నమోదు కాగా, అందులో ముంబై నగరం నుంచే 5,190 కేసులు ఉన్నాయి. పుణె, నాగపూర్, అకోలా, నాందేడ్ తదితర జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ అక్కడి ప్రభుత్వం అమలుపరుస్తోంది.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే,  దేశవ్యాప్తంగా కొత్తగా మరో 53,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది. నిన్న ఒక్కరోజే 251 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,60,692 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,490 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,12,31,650 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,95,192 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.28 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 3.35 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.36% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 24 వరకు దేశవ్యాప్తంగా 23,75,03,882 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే  10,65,021 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 5 లక్షలు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 5,31,45,709 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.