Mumbai, Mar 8: మహారాష్ట్రలో 73 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కోటి రూపాయలతో మహిళ ఉడాయించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మలద్ ప్రాంతానికి చెందిన జెరాన్ డిసౌజా అనే వృద్ధుడు (73-Year-Old Man) 2010లో తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన రూ. 2 కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఓ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు.
అయితే ఇటీవల వాటిపై వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్నివిత్‌డ్రా చేసుకున్నాడు. అయితే అదే బ్యాంకులో పనిచేసే షాలిని అనే మహిళ ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. వృద్ధుడితో పరిచయం చేసుకుని స్నేహం చేయడం మొదలు పెట్టింది. అతడ్ని పెళ్లి చేసుకుంటానని, వృద్ధాప్యంలో తోడుగా ఉంటానని నమ్మబలికింది. ఇది నమ్మిన వృద్ధుడు ఆమెతో కలిసి సినిమాలు, రెస్టారెంట్లకు షికార్లు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో తాను ఓ వ్యాపారం ప్రారంభిస్తున్నానని, ఇందుకు ఇన్‌వెస్ట్‌మెంట్ పెడితే, ఇచ్చే లాభాలను ఇద్దరం పంచుకుందామని ఆ మహిళ నమ్మబలికింది. ఇది నమ్మిన ఆ వృద్ధుడు దాదాపు 1.3 కోట్ల రూపాయలను ఆమెకు ( Runs Away Over Rs 1 Crore) అప్పజెప్పాడు. డబ్బులు తన ఖాతాలో ట్రాన్స్‌ఫర్ అయిన వెంటనే ఆ మహిళ మొభైల్ స్విచ్ఛాఫ్ చేసి వేరే ఊరికి మకాం మార్చింది. అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు డిసౌజా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక బెంగుళూరులో వ్యాపారవేత్తను బెదిరించి రూ.15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. టీబీ డ్యాం సీఐ నారాయణ తెలిపిన వివరాలు మేరకు కొప్పళ్‌లో స్టీల్ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త హొస్పేటలోని ఎంజే నగర 6వ క్రాస్‌లో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎదురుగా ఉన్న ఇంటిలో గీతా అనే మహిళ నివాసం ఉంటోంది. 2019 మార్చిలో వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. ఒక రోజు ఆయన్ను గీతా తన ఇంటికి ఆహ్వానించి తేనీరు ఇచ్చింది. దీంతో ఆయన మూర్ఛబోయాడు.
గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత గీతా ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షల ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని సూచించింది. దీంతో ఆయన గీతా బ్యాంకు ఖాతాకు రూ.15లక్షలు జమ చేశాడు. మిగితా డబ్బు కోసం గీతా ఒత్తిడి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గీతా ఇంటిలో తనిఖీలు నిర్వహించగా 2.750 గ్రాముల గంజాయి లభించింది. గీతాతో పాటు ఆమెకు సహకరించిన కుమారుడు విష్ణును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు.