Bengaluru, NOV 30: బెంగళూరులో ఒక యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ (Bike Taxi Driver), అతడి సన్నిహితుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి శుక్రవారం అర్ధ రాత్రి ర్యాపిడో బైక్ ట్యాక్సీ (Rapido bike taxi) బుక్ చేసుకుంది. ఒక స్నేహితురాలి ఇంటి నుంచి మరో చోటుకు వెళ్లాల్సి ఉంది. ఆమె ఉన్న చోటుకు చేరుకున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్, ఆ యువతిని బైక్‌పై ఎక్కించుకుని ఆమె చేరాల్సిన చోటుకు తీసుకెళ్లాడు. కానీ, అప్పటికే యువతి మద్యం సేవించి (Drunken) ఉండటంతో ఆమె బైక్‌పై నుంచి దిగే పరిస్థితిలో లేదు. ఇదే అదనుగా భావించిన ఆ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.
అప్పటికే అక్కడ మరో మహిళ కూడా ఉంది. ఆ యువతిని ఇంటికి తీసుకెళ్లి మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి (Rape)పాల్పడ్డాడు. తర్వాత మరో వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు తేరుకున్న మహిళ అతడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ, విపరీతమైన ఒళ్లు నొప్పులు రావడంతో ఆమెకేదో అనుమానం వచ్చింది.
దీంతో ఆమె స్థానిక ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా, అత్యాచారం విషయం వెలుగుచూసింది. వెంటనే డాక్టర్ల సూచనతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులతోపాటు, వారికి సహకరించిన మరో యువతిని కూడా అరెస్టు చేశారు.