Lucknow, NOV 27: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన కాలంలో మనం ఉన్నాం. కంప్యూటర్లు, రాకెట్లు, శాటిలైట్లు, సెల్‌ఫోన్లు.. వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న రోజులివి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్న ఈ రోజుల్లోనూ.. ఇంకా కొంతమంది వ్యక్తులు.. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల ఊబిలో చిక్కుకుపోయి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో కొందరు దారుణాలకు ఒడిగడుతుండటం బాధాకరం. తమ స్వార్థం కోసం సాటి మనిషి ప్రాణం తీయడం ఘోరాతి ఘోరం. సంతానం కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. మాంత్రికుడి మాటలు నమ్మి పదేళ్ల చిన్నారి రక్తం తాగి చంపేసింది. మాంత్రికుడి మాటలు నమ్మిన ఓ మహిళ.. పదేళ్ల చిన్నారిని బలి (killing boy) ఇచ్చింది. అంతకు ముందు బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది. ఒళ్లు జలదరించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కాకపోతే ఇది చాలా కాలం క్రితమే జరిగింది. తాజాగా ఈ కేసులో దోషిగా తేలిన ఆ మహిళకు ఉత్తర్ ప్రదేశ్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
క్షుద్రపూజల పేరుతో ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి ఆమె ఈ దారుణానికి ఒడికట్టింది. షాజహాన్‌పూర్ (Shahjahanpur) జిల్లా రోజా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జముకా గ్రామానికి చెందిన ధన్‌దేవికి(Dhandevi) పెళ్లయి ఆరేళ్లయినా సంతానం లేదు. పిల్లల కావాలని అనేక పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో ఓ మాంత్రికుడిని ఆశ్రయించింది. బాలుడి రక్తం తాగి చంపితే పిల్లలు పుడతారని అతడు చెప్పాడు. అది నమ్మిన మహిళ.. పదేళ్ల బాలుడి రక్తం తాగి చంపేసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఘటనపై బరేలీ కోర్టు తీర్పు వెలువరించింది. 2017 డిసెంబర్ 5న తన పొరుగింట్లో ఉండే లాల్‌దాస్ అనే పదేళ్ల చిన్నారిని మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసింది మహిళ. అనంతరం క్షుద్రపూజలు (tantrik ritual) చేసి బాలుడి గొంతు కోసి చంపేసింది. దీనికి ముందు బాలుడి చెంప కోసి రక్తాన్ని తాగింది (drank blood). తర్వాత శవాన్ని ఇంటి ముందు పడేసింది. సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాంత్రికుడి మాటలు నమ్మి బాబుని మహిళ బలి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య కేసులో ధన్‌దేవీతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పూర్తిచేసిన బరేలీ జిల్లా కోర్టు.. దోషులకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే రూ.5వేలు జరిమానా విధించింది. పిల్లల లేకపోవడంతో ఓ మాంత్రికుడు చెప్పినట్లు తానీ పని చేశానని ఆ మహిళ పోలీసుల విచారణలో ఒప్పుకుంది. కోర్టు తీర్పుపై బాలుడి తండ్రి స్పందించారు. దోషులకు ఈ శిక్ష సరిపోదన్నారు. వారికి మరణశిక్ష విధించి ఉండాల్సిందని వాపోయారు.
చిన్నారిని హత్య చేసిన మూడు రోజుల తర్వాత అంటే.. 2017 డిసెంబర్ 8న.. మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ధన్ దేవి భర్త పేరు ధరమ్ పాల్. ఫిలిబిత్ జిల్లాలో నివాసం ఉంటాడు. అయితే, ధన్ దేవికి పిల్లలు పుట్టకపోడంతో ఆమె అత్తింటి వారు వేధించారు. దీంతో ఆమె భర్తను వదిలి షాజహాన్ పూర్ లోని బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడే ఆమె తాంత్రికుడిని కలిసింది. చిన్నారిని బలి ఇస్తే పిల్లలు పుడతారని అతడు చెప్పడంతో.. గుడ్డిగా నమ్మిన ధన్ దేవి.. దారుణానికి ఒడిగట్టింది.