A file photo of activist Varavara Rao | PTI

Mumbai, July 16: ప్రముఖ కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమ కారుడు వరవరరావు(81) (Varavara Rao) కరోనా వైరస్ బారినపడ్డారు. ఓ కుట్ర కేసులో నిందితుడిగా ముంబయి తలోజా జైల్లో ఉన్న విరసం నేత వరవరరావు అనారోగ్యంతో బాధపడుతుండగా, అనేక విజ్ఞప్తుల అనంతరం ప్రభుత్వం ఆయనను  ఆసుపత్రికి తరలించింది. ఆయన శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ (Varavara Rao Tested Corona Positive) అని తేలింది. ఈ విషయాన్ని వరవరరావు తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ముంబయి జేజే ఆసుపత్రిలో (J J Hospital) ఉండగా, కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆయనను సెయింట్ జార్జ్ ఆసుపత్రికి (St George Hospital) తరలించారు. తలొజా జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం, భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించిన జైలు సిబ్బంది, భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన విరసం నేత

ఇటీవల కొంతకాలంగా వరవరరావు వృద్ధాప్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆయనను విడుదల చేయొద్దంటూ ఎన్ఐఏ గట్టి పట్టుదలతో ఉంది. చివరికి పౌరసమాజం నుంచి కూడా ఒత్తిళ్లు వస్తుండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలతో వరవరరావును గతేడాది ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను ముంబైలోని తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించినట్లు జైలు అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో,ఇటు మీడియా ద్వారా చాలామంది వరవరరావు విడుదలకు డిమాండ్ చేశారు.