Supreme Court. (Photo Credits: Wikimedia Commons

అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. ఈ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో నిప్పుతో ఆడుతున్నారని పంజాబ్‌ గవర్నర్‌ను (Punjab Governor) ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం.. బిల్లులను ఆలస్యం చేయవద్దని సూచించింది.

అసెంబ్లీ తీర్మానించిన బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగులో ఉన్న అంశంపై పంజాబ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారించింది. ఇష్టానుసారం బిల్లులు క్లియర్‌ చేస్తామని గవర్నర్‌ ఎలా చెబుతారు? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించడంలేదా?’ అని ప్రశ్నించింది. భారతదేశం ఏర్పాటు నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, నియమ నిబంధనలను గవర్నర్లు అనుసరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హిందూ మత రక్షణ కోసం మార్గదర్శకాలు రూపొందించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు

బిల్లుల పెండింగు విషయంపై ఇటీవల జరిగిన వాదనల సమయంలోనూ గవర్నర్‌ జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాదనే వాస్తవాన్ని గవర్నర్లు విస్మరించరాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంపై గవర్నర్లు తమ పనితీరుపై చిన్నపాటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని అభిప్రాయపడింది. తాజాగా గవర్నర్ల తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.