New Delhi, May 06: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు, ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ కంపెనీలో పనిచేసే డెలివరీ భాగస్వాముల పిల్లల చదువుల కోసం భారీ విరాళాన్ని (Donation) ప్రకటించారు. ఇందుకోసం జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (Zomato Future Foundation)కు దాదాపు రూ.700కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ESOPల నుంచి ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోలో చెప్పారు. జొమాటో (Zomato) పబ్లిక్ లిస్టింగ్‌లోకి వెళ్లడం కంటే ముందు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు, బోర్డు ఆయనకు కొన్ని ESOP (ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్) లను ఇచ్చాయి. వీటిల్లో కొన్నింటి గడువు తీరిపోవడంతో ఆ షేర్లను గోయల్ విక్రయించనున్నారు.
The Zomato CEO @deepigoyal has pledged to secure the lives of the delivery agents and education for their children is absolutely praiseworthy !
Indeed a pioneering benchmark set for the corporate apparatus.
Right attitude and intention creates a big difference! pic.twitter.com/49oXMA6tIW
— Vinod Tawde (@TawdeVinod) May 6, 2022
గత నెల ఉన్న సగటు షేరు ధర ప్రకారం.. ఈ ESOPల విలువ దాదాపు 90 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.700కోట్లు. ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు గోయల్ వెల్లడించారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేకరించిన విరాళాలను జొమాటోలో పనిచేసే డెలివరీ భాగస్వాముల పిల్లల చదువుల కోసం ఉపయోగించనున్నారు. డెలివరీ పార్ట్‌నర్లు గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు ఈ సాయాన్ని పొందొచ్చు.
కంపెనీలో కనీసం ఐదేళ్లు పూర్తయిన డెలివరీ భాగస్వాముల పిల్లలకు ఏడాదికి రూ.50వేల వరకు సాయం చేయనున్నట్లు గోయల్ తెలిపారు. ఒకవేళ సదరు ఉద్యోగి కంపెనీలో 10ఏళ్లు పూర్తిచేసుకుంటే వారి పిల్లలకు రూ.లక్ష వరకు ఇవ్వనున్నారు. మహిళా డెలివరీ భాగస్వాములకు సర్వీసు నిబంధన ఇంతకంటే తక్కువేనని గోయల్ తెలిపారు. అంతేగాక, ఆడపిల్లలకు ప్రత్యేక పథకాలు, 12వ తరగతి పూర్తి చేసిన పిల్లలకు ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పిల్లల ప్రతిభను బట్టి ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తూ డెలివరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ప్రమాదానికి గురైతే.. సర్వీసుతో సంబంధం లేకుండా వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.