PM Modi Challenge: ఆర్టికల్ 370ని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలరా? ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన ప్రధాని మోడీ, మహారాష్ట్రలో ఊపందుకున్న రాజకీయం
pm-Narednra-modi-challenges-opposition-to-bring-back-article-370 (Photo-ANI)

Jalgaon, October 13:  త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న సంగతి తెలిసిందే. బిజెపి కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా వేడెక్కాయి. వచ్చిరాగానే ప్రతిపక్షాల మీద మాటల దాడి చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని వ్యతిరేకించే వారికి రాజకీయ జీవితమే ఉండదని ప్రతిపక్షాలపై నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.

మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆర్టికల్ 370పై స్పష్టమైన నిర్ణయం లేదని , దాని వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.‘నేను ప్రతిపక్షాన్ని సవాలు చేస్తున్న. మీకు ధైర్యం ఉంటే కశ్మీర్‌పై ఒక స్టాండ్ తీసుకోండి. వారికి అంత ధైర్యమే ఉంటే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లపై మీ అభిప్రాయాలతో మానిఫెస్టో విడుదల చేయండి. ఓట్ల ద్వారా ప్రజలే వారి నిర్ణయాన్ని తెలుపుతారని ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.

సవాల్ విసిరిన ప్రధాని

ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపివేయాలని హితవు పలికారు. ఆర్టికల్ 370ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తే ఇక వారికి రాజకీయ సమాధి తప్పదని ఈ సంధర్భంగా హెచ్చరించారు. ఆగస్టు 15న మేం తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని, 70 స్వాతంత్ర్య చరిత్రలో ఎవరూ ఈ పని చేయలేకపోయారని మోడీ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలో ప్రతీచోట ఇప్పుడు ఇండియా వాయిస్ వినపడుతోందని తెలిపారు. న్యూ ఇండియాలో జోష్ వినపడుతుందంటే అది మోడీ వల్ల కాదని మీ ఓటు ద్వారానే అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని మహారాష్ట్ర ఓటర్లను మోడీ కోరారు.