PM Modi in video-conference | File Image | (Photo Credits: LinkedIn/Narendra Modi)

New Delhi, May 10: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రులతో మరోమారు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

సమావేశం నిర్వహించనున్నారని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సందర్భంగా రాష్ట్రాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు, రాష్ట్రాల యొక్క సూచనలు స్వీకరించేందుకు ప్రధాని మోదీ ఈ రకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే నాలుగు సార్లు సీఎంలతో ఇంటరాక్ట్ అయిన పీఎం, రేపు ఐదో సారి ఇంటరాక్ట్ కానున్నారు.

ప్రస్తుతం దేశంలో మూడవ ఫేజ్ లాక్డౌన్ మే 17 వరకు అమలులో ఉంటుంది. అయితే దీనిని మరింత పొడగించాలా? లేదా ముగించాలా? అనే అంశంపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా తీవ్రత ఆధారంగా కేంద్రం వర్గీకరించిన జోన్లపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తిన అభ్యంతరాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

See PMO India's Tweet:

ఇతర రాష్ట్రాల నుండి స్వరాష్ట్రాలకు తరలి వెళ్తున్న వలస కూలీల ద్వారా అనేక రాష్ట్రాల్లో అకస్మాత్తుగా గణనీయమైన COVID-19 పెరుగుదల కనిపిస్తుంది. ఇంతకాలం గ్రీన్ జోన్లుగా ఉండేవి, ఇప్పుడు రెడ్ జోన్లలోకి వెళ్తున్నట్లు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు.  భారత్‌లో 62,939కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 2 వేలు దాటిన మరణాలు

వీటితో పాటు మే 17 తర్వాత ఇంకా ఏవైనా సడలింపులివ్వాలా? లేదా ఆంక్షలు కొనసాగించాలా? అనే దానిపై కూడా చర్చించనున్నారు. సోమవారం జరిగే వీడియో కాన్ఫరెన్సులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ మాట్లాడటానికి అనుమతించబడుతుంది. అంతకుముందు జరిగిన వీడియో కాన్ఫరెన్సుల్లో ప్రధాని తాను మాట్లాడబోయే ముఖ్యమంత్రులను నిర్ణయించేవారు. ఈ నేపథ్యంలో రేపటి వీడియో కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది.