Hyderabad, September 17: త్వరలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) తాము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని మహారాష్ట్రకు చెందిన కొంతమంది నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉండే మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలైన నాందేడ్, దెగ్లూర్, భోకర్, నయిగాం, హథ్ గావ్ మరియు కిన్వట్ ప్రాంతాల నుంచి కొంతమంది రైతులు, నాయకుల బృందం హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మంగళవారం కలిశారు.
ఈ సందర్భంగా మహారాష్ట్రలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చాలా బాగా అమలవుతున్నాయని, రైతు బంధు మరియు రైతు బీమా లాంటి పథకాలు అద్భుతంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అయితే తమ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో కూడా తెలంగాణ తరహా పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. లేదంటే తమ ప్రాంతాలను కూడా తెలంగాణ కలిపేయాలని ఉద్యమిస్తామని పేర్కొన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇదే డిమాండ్ తో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఇందుకోసం తమకు మద్ధతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను వారు అభ్యర్థించారు. మహారాష్ట్రలో టీఆర్ఎస్ పార్టీ తరఫున తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా తమ కోరికను కేసీఆర్‌కు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ స్పందిస్తూ దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని వారికి హామి ఇచ్చారు. మహారాష్ట్ర రైతు నాయకుల చొరవను కేసీఆర్ స్వాగతించారు. రైతుల డిమాండ్లపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో కూడా మహారాష్ట్రకు చెందిన దాదాపు 40 మంది సర్పంచులు తమని తెలంగాణలో కలపాల్సిందిగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే మహారాష్ట్రలో టీఆర్ఎస్ అభ్యర్థుల పోటీకి సంబంధించి కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ పార్టీగానీ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనిని బట్టి చూస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ అనేది కేవలం ఊహాగానాలకు మాత్రమే పరిమితం కావొచ్చు.
ఇకపోతే, రానున్న అక్టోబర్ నెలలో దసరా పండుగ ముగిసిన తర్వాత మహారాష్ట్రతో పాటు, హర్యానా మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 20న ఎలక్షన్ కమీషన్ ఈ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.