Mumbai, July 3: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతేగా పవార్ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒకరోజు క్రితం ప్రమాణం చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ త్వరలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్థానంలోకి వస్తారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సోమవారం తన వాదనను పునరుద్ఘాటించారు. దాదాపు ఏడాది క్రితం శివసేనలో చీలికలో భాగమైన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయబోతున్నారని రౌత్ అన్నారు.
ఈరోజు నేను కెమెరా ముందు ఈ విషయాన్ని చెబుతున్నాను, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారు. ఏక్నాథ్ షిండేను తొలగిస్తున్నారు. ఏక్నాథ్ షిండే, 16 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా మారబోతున్నారు" అని రౌత్ ANIతో మాట్లాడుతూ అన్నారు. మహారాష్ట్రలో శివసేన-బిజెపి కూటమిలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేరి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఐక్యంగా పోరాడతాయని రౌత్ అన్నారు.
'శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ విడగొడుతోంది కానీ దీని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మహారాష్ట్రలో ఐక్యంగా పోరాడుతాం.. ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రధాని మోదీ చెప్పడం విస్మయకరం. అని రౌత్ అన్నారు.
జూన్ 2022లో, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల బృందం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసింది - కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్ధవ్ నిర్ణయం పార్టీ హిందూత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని వారు పార్టీ నుండి బయటకు వచ్చారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వంలో అప్పటి క్యాబినెట్ మంత్రి షిండే, శివసేనను నిలువునా చీల్చిన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. MVA పతనం బిజెపి-బాలాసాహెబంచి శివసేన ఏర్పాటుకు దారితీసింది. జూన్ 30న షిండే సీఎంగా, ఫడ్నవీస్ డిప్యూటీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్‌డిఎ ప్రభుత్వంలో చేరి ప్రస్తుత డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు మహారాష్ట్రకు రెండవ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆదివారం కూడా రౌత్ మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్రకు మరో ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని రౌత్ అన్నారు. ఈ ప్రక్రియ జరుగుతోందని మాకు ముందే తెలుసు.. దీని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది జరగవచ్చని నేను ముందే చెప్పాను.ఏకనాథ్ షిండేపై వేలాడుతున్న అనర్హత కత్తి త్వరలో పడనుంది. అతనితో వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రకు మరో ముఖ్యమంత్రి వస్తారని రౌత్ అన్నారు.
ఇక కుటంబ చీలికపై శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. తాజా పరిణామంతో తన కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవని (No Problem In Family) తెలిపారు. మేము ఇంట్లో రాజకీయాల గురించి చర్చించము. ప్రతి ఒక్కరూ వారి సొంత నిర్ణయాలు తీసుకుంటారు’ అని తెలిపారు.పవార్ ఈ రోజు ఉదయం సతారా జిల్లాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వాతంత్ర్య పోరాట యోధుడు వైబీ చౌహాన్ స్మారకాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘నేను నిన్నటి నుంచీ ఎవరినీ సంప్రదించలేదు. ఇప్పుడు సతారాకు బయలుదేరుతున్నా’ అని చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఎన్సీపీ చీలిక చర్చనీయాంశమైంది. అయితే, తాజా పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం లేదని పవార్ స్పష్టం చేశారు. త్వరలోనే బెంగళూరులో ప్రతిపక్ష కూటమి సమావేశం ఉంటుందని వెల్లడించారు. కాగా ఇటీవల ఎన్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్‌తోపాటు చీలిక వర్గంలో చర్చనీయాంశమైంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో దాదాపు 30 మంది అజిత్ పవార్ వెంట ఉన్నారని సమాచారం. అజిత్ పవార్ నిర్ణయాన్ని సీఎం ఏక్‌నాథ్ షిండే స్వాగతించారు. తాజా పరిణామాలు విపక్ష కూటమికి మింగుడు పడటం లేదు. బీజేపీతో అజిత్ పవార్ చేరుతారని ముందే ఊహించామని శివసేన(యూబీటీ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చెప్పిన ప్రజాస్వామ్యం బహుశా ఇదేనేమో!’ అంటూ కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు.