Syed Altaf Bukhari (Photo Credits: ANI)

Srinagar, March 9: ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) అనేక మార్పులు వచ్చాయి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత.. ఇప్పుడు మళ్లీ అక్కడ సామాన్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాజకీయ వేదికపై (Jammu and Kashmir politics) మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. 'జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ' (జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఆదివారంనాడు శ్రీనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని. ‘జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ’ (JAMMU AND KASHMIR APNI PARTY) పేరుతో ఈ కొత్త పార్టీని పీడీపీ మాజీ మంత్రి అల్టాఫ్ బుఖారి (Syed Altaf Bukhari) ప్రారంభించారు.పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌కు చెందిన 40 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆరు నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొత్త రాజకీయ శక్తి అవతరించడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు.

కొత్త పార్టీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం బుఖారి మీడియాతో మాట్లాడుతూ, ఇది కుటుంబ పార్టీ కాదని, ఇది సామాన్యుల కోసం, సామాన్యుల చేత ఏర్పడిన పార్టీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరైనా సరే రెండు సార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్నారు.

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టను కాపాడేందుకు, కశ్మీర్ పండిట్లు తిరిగి రావడానికి కట్టుబడి ఉంటామని, మహిళలు, యువకుల సాధికారతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. పూర్తి ఆశావహ దృక్పథం, నిజాయితీ, నిష్పాక్షికతతో పార్టీ ఏర్పాటు చేశామని, ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములేనని అన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల కలలు సాకారం చేసేందుకు పార్టీ కృషిచేస్తుందని బుఖారి చెప్పారు.

ఈ పార్టీలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రతినిధులతో పాటుగా.. కశ్మీరీ పండిట్లను కూడా చేర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్‌కు చెందిన నేతలంతా ఈ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.