Jaipur, July 26: సొంత పార్టీలోని ముఖ్య నేతల తిరుగుబాటుతో ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశ పరిచే అంశంపై గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది. జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి గవర్నర్ కాల్ రాజ్ మిశ్రాకు లేఖ వెళ్లింది. అయితే అసెంబ్లీ సమావేశాల అజెండాలో కరోనావైరస్ నియంత్రణ చర్యలు, ఇతర సాధారణ బిల్లులపైనే చర్చ ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ కు పంపిన లేఖలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని నివేదికలు వెల్లడించాయి.
అంతకుముందు కూడా అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, గవర్నర్ వాటిని తిప్పిపంపారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా, తేదీల ప్రస్తావన లేదని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి ముఖ్యమంత్రి కార్యాలయం ఎజెండా మరియు తేదీలను ఖరారు చేస్తూ కొత్తగా ప్రతిపాదనలు పంపింది.
ANI Tweet:
Rajasthan Govt proposal to Governor asks to start Assembly Session from July 31st, proposes discussion on Coronavirus and other Bills. No mention of floor test in proposal: Sources
— ANI (@ANI) July 26, 2020
మరోవైపు, బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం నుంచి దేశవ్యాప్త నిరసనలకు ప్లాన్ చేసింది. అసెంబ్లీని సమావేశ పరచాలని రాజ్‌భవన్‌ని ముట్టడించిన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అయితే అధికార పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పదవి మరియు పీసీసీ చీఫ్ గా వ్యవహరించే సచిన్ పైలైట్ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు లేవనెత్తారు. తనకు 18 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రకటించారు. సీఎం అశోక్ గెహ్లాట్ తన బలాన్ని నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు. దీంతో అప్పట్నించీ రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ముదురుతూ వస్తోంది. ఇలాంటి సందర్భంలో సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటానికి గవర్నరుకు ప్రతిపాదనలు పంపడం, ఎజెండాలో బలనిరూపణ అంశం లేకపోవడంతో రాజస్థాన్ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చినట్లయింది.