Assembly Election Results 2022: నాలుగు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకి, పంజాబ్ ఆప్ ఖాతాలోకి, ఏయే రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో పూర్తి వివరాలు ఇవే..
Assembly Election Results 2022 (Photo Credits: Latestly)

ప్రధాని మోదీ సారథ్యంలోని కమలం మళ్లీ విరబూసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసింది. ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవాలో విజయఢంకా మోగించింది. 2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్​లో (Assembly Election Results 2022) బీజేపీ సత్తా చాటింది.

ఇక పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీని ఆప్ (AAP)​ ఊడ్చేసింది. ఇన్నాళ్లూ ఢిల్లీకే పరిమితమైన ఆమ్​ ఆద్మీ.. ఇప్పుడు మరో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడంతో దేశ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కాంగ్రెస్​ (Congress) గ్రాఫ్​ ఇంకా కిందికి దిగజారింది. అధికారంలో ఉన్న పంజాబ్​ను కోల్పోవడమే కాక.. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్​లో కేవలం 2 సీట్లకే పరిమితమైంది.

యూపీలో మళ్లీ బీజేపీకే (BJP) జనం జై కొట్టారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా రెండోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. మోడీ-– యోగి కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా దూదిపింజలా తేలిపోయింది. నిరుద్యోగులు, రైతులు, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అభివృద్ధి నినాదానికే ప్రజలు ఓటేశారు. ఎన్నికలకు ముందు కీలక నేతలు సైతం బీజేపీని వీడి ఎస్పీలో చేరినా.. యోగి సర్కారు సునాయాసంగానే గెలుపు తీరం దాటింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం.. బీజేపీకి ఈ సారి సీట్లు తగ్గిపోయాయి. ఎస్పీకి భారీగా సీట్లు పెరిగాయి.

లఖింపూర్‌ ఖేరీలో బీజేపీ క్లీన్ స్వీప్, రైతుల నిరసనలు ఏమయ్యాయని ప్రతిపక్షాలు షాక్, పార్టీ గెలిచినా అక్కడ యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉండగా, మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 202 మార్కును దాటి 255 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఈసారి ఓట్లను, సీట్లను పెంచుకున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేక 111 సీట్ల దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితం కాగా, బీఎస్పీ 1 సీటు మాత్రమే గెలవగలిగింది. ఇక ఎంఐఎం, ఆర్ఎల్డీ వంటి ఇతర పార్టీలు సోదిలో లేకుండా పోయాయి. ప్రధానంగా బీఎస్పీ ఈ ఎన్నికల్లో అటు ఓట్లను, ఇటు సీట్లను కోల్పోయి అతి దారుణంగా ఓటమిపాలైంది.

ఆప్‌ పంజాబ్‌లో మరో సరికొత్త రికార్డు

ఆప్‌ పంజాబ్‌లో మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్‌ తిరగరాశారు. 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం 2022 ఎన్నికల్లో చోటుచేసుకుంది. కాగా, 1962లో క్రాంగెస్‌ 90 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలుపొంది రికార్డును తిరగరాసింది. కాగా, బీజేపీ, అకాలీదళ్‌ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 18, శిరోమణి అకాలీదళ్‌ 3, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి.

గోవా ఫలితాలు

చిన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు గెలుచుకుంది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 2, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూటమికి 3 సీట్లు వచ్చాయి.తృణమూల్‌ కూటమిలో ఉన్న ఎంజీపీ రెండు సీట్లు సాధించింది. ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. ఎంజీపీకి చెందిన ఇద్దరు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ బలం 25కు చేరింది. గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఇక లాంఛనమే. ఎంజీపీ తమకు బేషరతుగా మద్దతునిచ్చేందుకు అంగీకరించిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు.

మణిపూర్‌లో బీజేపీ విజయ కేతనం

మణిపూర్‌లోనూ బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాలను గెలుచుకొని మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్‌పీపీ ఏడు స్థానాల్లో.. ఎన్పీఎఫ్‌ కూడా అయిదు స్థానాల్లో విజయం సాధించింది. ఇక జేడీయూ ఆరు చోట్ల గెలుపొందింది. ఇతరులు అయిదు స్థానంలో గెలిచారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ విజయం సాధించారు. హింగాంగ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పంగేజం శరత్‌చంద్ర సింగ్‌పై 17 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆ సందర్భంగా బీరెన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మణిపూర్ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.

ఉత్త‌రాఖండ్ కాషాయం రెపరెపలు

మొత్తం 70 సీట్లు క‌లిగిన ఉత్త‌రాఖండ్ అసెంబ్లీలో అధికార బీజేపీ ఏకంగా 47 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. అదే స‌మ‌యంలో ఓ రేంజిలో స‌త్తా చాటుదామ‌ని భావించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 19 సీట్ల‌తోనే స‌రిపెట్టుకోక త‌ప్ప‌లేదు. పంజాబ్‌లో స‌త్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్త‌రాఖండ్‌లో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఉత్త‌రాఖండ్‌లో ఆప్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక‌పోయింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఈ రాష్ట్రంలో 4 సీట్ల‌ను గెలుచుకున్నారు. ఇక 70 సీట్లు క‌లిగిన ఉత్త‌రాఖండ్‌లో మ్యాజిక్ ఫిగ‌ర్ 36. అయితే దానిని మించి 47 స్థానాలు సాధించిన బీజేపీ అక్క‌డ మ‌రోమారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అయితే సీఎంగా ఉన్న పుష్క‌ర్ సింగ్ ధామి అనూహ్యంగా ఓట‌మిపాల‌య్యారు.