Assembly Elections 2022 Highlights: మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్, భారీ ఎత్తున తరలివచ్చిన ఓటర్లు, మార్చి 10న ఓట్ల లెక్కింపు
Elections (Photo Credits: PTI)

Lucknow, Feb 14: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ (Assembly Elections 2022 Highlights) ముగిసింది. యూపీలో సాయంత్రం 6 గంటల సమయానికి 60.69 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్ లో 55 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

అటు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఒకే విడతలో పోలింగ్ చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్ లో (Uttarakhand Vidhan Sabha Election Results 2022) మొత్తం 70 సీట్ల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల సమ 59.37 శాతం పోలింగ్ నమోదైంది.

గోవాలో (Goa Assembly Election Results 2022) భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఇక్కడ 75.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా, అన్నింటికి ఇవాళ పోలింగ్ చేపట్టారు. ఇంకా, యూపీలో 5 దశల పోలింగ్ మిగిలుంది. మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కలిపి మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల రెండో ద‌శ పోలింగ్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు ఓట‌ర్లు పోటెత్తారు. ఉద‌యం నెమ్మ‌దిగా ఆరంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ ఆపై పోలింగ్ కేంద్రాల‌కు పెద్ద‌సంఖ్య‌లో ఓట‌ర్లు చేరుకోవ‌డంతో ఊపందుకుంది. ఇక సంభాల్‌లో బీజేపీ అభ్య‌ర్ధి వాహనాన్ని ధ్వంసం చేయ‌డంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. అస్మోలి నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ అభ్య‌ర్ధి హ‌రేంద్ర అలియాస్ రింకూ వాహ‌నంపై కొంద‌రు దాడి చేశారు. అనుచ‌రుల‌తో పాటు అభ్య‌ర్ధి పోలీస్ స్టేష‌న్‌లో త‌ల‌దాచుకున్నారు. ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌త్యర్ధుల దాడిలో రింకూ వాహ‌నం పూర్తిగా ధ్వంస‌మైంది.

Here's ANI Update

రెండో ద‌శ‌లో భాగంగా యూపీలోని 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు సోమ‌వారం పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వార‌స‌త్వ‌, కుటుంబ పార్టీలు రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి మేలు చేయ‌వ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఝాన్సీలో జ‌రిగిన ర్యాలీలో విమ‌ర్శించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఆపై ఇప్పుడు రాహుల్ గాంధీ వీరిలో ఎవ‌రైనా రాష్ట్ర ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ప‌నిచేశారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇక రాష్ట్రంలో మాపియాపై ఉక్కుపాదం మోపుతూనే అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నామ‌ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ మొయిన్‌పురిలో జ‌రిగిన ప్ర‌చార ర్యాలీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇక‌ యూపీలో ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ‌ర‌కూ ఏడు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో గెలుపొంది మ‌రోసారి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని పాల‌క బీజేపీ పావులు క‌దుపుతుండ‌గా, యోగి స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకుని అంద‌లం ఎక్కాల‌ని అఖిలేష్ సార‌ధ్యంలోని ఎస్పీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. మ‌రోవైపు ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో ఉనికి చాటుకోవాల‌ని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండ‌గా..ద‌ళితులు, అణ‌గారిన వ‌ర్గాల వెన్నుద‌న్నుతో స‌త్తా చాటాల‌ని మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.