Uttar Pradesh, February 14: ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలకు సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. అలాగే ఉత్తర ప్రదేశ్ లో రెండో దశ ఎన్నికలు ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్, గోవాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ (Assembly Election Results 2022) జరగనుంది. ఉత్తరాఖండ్‌లో మాత్రం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
ఉత్తరాఖండ్‌లోని 70, గోవాలోని 40 స్థానాలకూ ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. ఉత్తరాఖండ్‌లో 81 లక్షల మంది ఓటర్లుండగా, 152 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 632 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, విపక్ష నేత దిగంబర్ కామత్ తదితరులు బరిలో ఉన్నారు.
ఐదోసారి అసెంబ్లీ ఎన్నికలు (Voting Underway For Goa, Uttarakhand ) జరుగుతున్న ఉత్తరాఖండ్‌లో 11,697 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు. 2017 ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఏకంగా 57 సీట్లు నెగ్గింది. ఇక గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లు గెలుచుకున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 11 లక్షలకు పైగా ఓటర్లున్నారు. 301 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇక యూపీలో రెండో దశ పోలింగ్‌కు (Uttar Pradesh Phase 2 Vidhan Sabha Polls) సర్వం సిద్ధమైంది. 9 జిల్లాలు సహరన్‌పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బదౌన్, బరేలీ, షాజహాన్‌పూర్ పరిధిలో 55 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా జరిగే పోలింగ్‌లో 2.01 కోట్ల మంది ఓటర్లు 586 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం ఓటర్లలో 1.07 కోట్ల మంది పురుషులు, 93.7 లక్షల మంది మహిళలు కాగా 1,261 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. 55 సీట్లలో 9 ఎస్సీ స్థానాలున్నాయి. బిజ్నోర్ సహా 8 అసెంబ్లీ స్థానాలను సున్నితమైనవిగా గుర్తించారు. ఇక్కడ మరింత భద్రత ఏర్పాట్లు చేసినట్టు అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
పేరుకు రెండో దశే అయినా, యూపీలో సోమవారం జరగనున్న పోలింగ్‌లో ఏకంగా 2 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భాగ్యరేఖలను నిర్దేశించనున్నారు. అందుకే 55 అసెంబ్లీ స్థానాల్లో జరుగుతున్న ఈ పోలింగ్ అధికార బీజేపీ, సమాజ్‌వాదీతో పాటు అన్ని పార్టీలకూ కీలకంగా మారింది. 9 జిల్లాల పరిధిలో పోలింగ్ జరుగుతున్న ఈ రెండో దశలో బీజేపీదే పై చేయి కావచ్చని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. ఎస్పీకి కంచుకోటలుగా ఉంటూ వస్తున్న ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు కూడా ఈ దశలో ఎక్కువగా ఉండటం పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
యూపీ రెండో దశ పోలింగ్‌లో పలువురు మంత్రులు బరిలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా షాజహాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఏకంగా 8సార్లు నెగ్గారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక బీజేపీ నుంచి ఎస్పీలోకి దూకిన మంత్రి ధరంసింగ్ సైనీ నకుద్‌లో పోటీ చేస్తున్నారు. సహాయ మంత్రులు బల్‌దేవ్ సింగ్ ఔలఖ్ (బిలాస్‌పూర్), మహేశ్ చంద్ర గుప్తా (బదౌన్), గులాబ్ దేవీ (చందౌసీ), ఛత్రపాల్ గాంగ్వర్ (బహేరీ) కూడా ఈ దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న వారిలో ఉన్నారు.
ఇక సమాజ్‌వాదీ నుంచి సీనియర్ నేత మహ్మద్ ఆజం ఖాన్ రాంపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఆయన జైలు నుంచే ఎన్నికల బరిలో దిగారు. ఆజం ఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజం కూడా స్వర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా మరో రాజకీయ కుటుంబమైన రాంపూర్ నవాబుల వారసుడు హైదర్ అలీ ఖాన్ బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ టికెట్‌పై బరిలో ఉన్నారు.
గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ తలైగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 15లో ఓటు వేశారు. గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పనాజీలోని పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఆయన నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గోవాలోని మా సోదరీమణులు, సోదరులు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 'సుస్థిరమైన, నిర్ణయాత్మకమైన, అవినీతి రహిత ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుంది. కాబట్టి బయటకు వచ్చి సంపన్నమైన గోవా కోసం ఓటు వేయండి' అని అమిత్ షా ఓటర్లను కోరారు.
ఉత్తరాఖండ్ పోలింగ్‌లో సీఎం, బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ సీఎం, ఖతిమా నుంచి బీజేపీ అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా పథకాలన్నీ ఉత్తరాఖండ్ ప్రజలకు రక్షణ కవచాన్ని అందించాయి. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో ప్రజలకు బాగా తెలుసు. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీకి 60కి పైగా స్థానాల్లో గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను' అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.