Visuals from a vote counting centre (Photo Credits: PTI)

New Delhi, May 2: పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఇటీవల పలు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. మధ్యాహ్నానికి ఫలితాలపై ఓ అంచనా రానుండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. లెక్కింపు కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. కాగా, వివిధ కారణాల వల్ల గతం కంటే పోస్టల్ బ్యాలెట్లు ఈసారి నాలుగురెట్లు పెరిగాయి.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సరళి మరో రెండుమూడు గంటల్లో తెలిసిపోనుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎం. గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ సహా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక బరిలో 41 మంది ఉన్నారు. ఇప్పటివరకు అందిన ఫలితాలను ఓ సారి పరిశీలిస్తే..

పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు (West Bengal Assembly Elections Results 2021)

బెంగాల్‌లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్‌ జరగగా అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాల్సి ఉంటుంది. కౌంటింగ్‌లో భాగంగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 1,113 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 78 చోట్ల ఆధిక్యంలో ఉండగా బీజేపీ 66 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. సీపీఐ(ఎమ్) 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇంకా ఖాతానే తెరవలేదు. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ తొలుత వెనుకంజలో పడినా మళ్లీ పుంజుకుని లీడింగ్ లోకి వచ్చారు. టీఎంసీకి రాజీనామాచేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని, బీజేపీ తరపున బరిలోఉన్న సువేందు అధికారి ఇక్కడ దీదీకి గట్టి పోటీనిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో దీదీ ముందంజలోఉన్నారు.

తమిళనాడు ఎన్నికల ఫలితాలు (Tamil Nadu Assembly Elections 2021)

234 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. డీఎంకే 34 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. అధికార అన్నాడీఎంకే 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.

అసోం ఎన్నికల ఫలితాలు (Assam Assembly Elections Results 2021)

47 స్థానాల ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ఫలితాల్లో అసోంలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 13, కాంగ్రెస్‌ 6 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి.AIUDF 5 చోట్ల, ఏజీపీ 4 చోట్ల, ఇతరులు 3 చోట్ల ముందంజలో ఉన్నారు.

కేరళ ఎన్నికల ఫలితాలు

కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ ఆధిక్యం దిశలో దూసుకుపోతోంది. ఎల్‌డీఎఫ్‌ 72 , యూడీఎఫ్‌ 53 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు

మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను దక్కించుకోగా AINRC 8 స్థానాల్లో, AIADMK 4 స్థానాల్లో, DMK 2 స్థానాల్లో ఇతరులు ఓ చోట విజయం సాధించారు. తాజా ఫలితాల్లో డిఎంకే 3 స్థానాల్లో దూసుకుపోతుండగా AINRC రెండు స్థానాల్లో, AIADMK ఓ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ ఓ స్థానంలో, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్‌ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు.

సాగర్ ఉప ఎన్నిక ఫలితం

నాగార్జునసాగర్‌ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్లు, మూడో రౌండ్‌లో 2,665 ఓట్ల‌ మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి.