Gandhi Nagar, Sep 13: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) గుజరాత్ 17 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ ప్రమాణం (Bhupendra Patel Swearing-in) చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గుజరాతీ భాషలో భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు. అనంతరం అమిత్ షా ను స్వాగతించేందుకు పటేల్ విమానాశ్రయానికి వెళ్లారు.
అమిత్ షాకు దండం పెట్టి స్వాగతించగా.. ఆయన పటేల్ వీపుపై తట్టారు. అంతకుముందు తన ఇంట్లో ప్రార్థనలు చేశారు. అనంతరం తాల్తేజ్‌లోని సాయిబాబా దేవాలయం, అదలాజ్‌లోని దాదా భగవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా నితిన్ పటేల్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు అందుకున్నారు. జామ్‌నగర్‌లో వరద బాదితులకు సహాయం చేస్తానని తొలి ట్వీట్ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక సీఎం పదవి ఆశించిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రూపానీ రాజీనామా తర్వాత సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నది నితిన్ పటేలే. కానీ బీజేపీ మాత్రం పెద్దగా పేరు లేని భూపేంద్రను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే పదవి మరోసారి మిస్సయినా తనకేమీ బాధ లేదని అన్నారు నితిన్ పటేల్. సోమవారం భూపేంద్రను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన నితిన్.. కంటతడి పెట్టడం గమనార్హం.
తన కోసం పార్టీ ఎంతో చేసిందని, పదవి రానందుకు తానేమీ అసంతృప్తిగా లేనని నితిన్ అన్నారు. సోమవారం ప్రమాణ స్వీకారానికి ముందు తనను కలవాల్సిందిగా భూపేంద్ర.. నితిన్‌ను కోరారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లిన నితిన్.. శుభాకాంక్షలు చెప్పారు. భూపేంద్ర పటేల్ మా కుటుంబ స్నేహితుడు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. సీఎంగా ఆయన ప్రమాణం చేయడం సంతోషంగా ఉంది. ఎప్పుడు అవసరం అయినా నా గైడెన్స్ కావాలని ఆయన అడిగారు. నేనేమీ అసంతృప్తిగా లేను. 18 ఏళ్ల వయసు నుంచీ బీజేపీతో పని చేస్తున్నాను. ఇలాగే కొనసాగుతాను. పార్టీలో నాకు ఓ స్థాయి వచ్చినా రాకపోయినా.. ఇలాగే సేవ చేస్తాను అని నితిన్ పటేల్ అన్నారు.
గుజరాత్‌లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్(59)ను అదృష్టం వరించింది. భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గుజరాత్ కొత్త సీఎం..పటేల్ సామాజిక వర్గంపై గురి పెట్టిన బీజేపీ
ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
భూపేంద్ర పటేల్ గుజరాత్‌లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు.
భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.
అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్ పాటిదార్ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అయ్యారు.
ఇక గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు.