Gandhi Nagar, Sep 12: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర భాయ్ పటేల్‌ను (Bhupendra Patel) ఎంపికచేశారు. విజయ్ రూపానీ రాజీనామా అనంతరం నేడు గాంధీనగర్‌లో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా (Bhupendra Patel to replace Vijay Rupani ) ఎన్నుకుంది. ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ భూపేంద్ర పేరును ప్రతిపాదించారు. మిగతా ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. 2022లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో విజయ్ రూపాని కన్నా సమర్థుడు కావాలని బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను తీసుకొచ్చింది.
కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పటేల్, కేంద్ర పరిశీలకులుగా ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎన్నికైన నేత నేరుగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని, ప్రమాణస్వీకారం చేసే తేదీని ఆ తర్వాత ఖరారు చేస్తామని గుజరాత్ బీజేపీ ప్రతినిధి యమల్ వ్యాస్ తెలిపారు.
గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్ కోరనున్నారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో పలు పేర్లు తెరపైకి వచ్చాయి.
పటేల్ సామాజిక వర్గానికే చెందిన నితిన్ పటేల్ పేరు బాగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ భూపేంద్ర పటేల్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. గుజరాత్ మాజీ సీఎం, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా భూపేంద్ర పటేల్‌కు పేరుంది. గతంలో ఆమె పోటీ చేసిన ఘట్లోడియా నుంచే 2017లో పోటీ చేసిన ఆయన.. లక్షకు పైగా ఓట్లతో విజయం సాధించారు. గతంలో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.
గుజరాత్ కొత్త సీఎం..పటేల్ సామాజిక వర్గంపై గురి పెట్టిన బీజేపీ
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి (ujarat Chief Minister) విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన (Vijay Rupani) పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే విజయ్ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.