Bihar Assembly Elections 2020: బీహార్‌కు కాబోయే‌ బాద్‌షా ఎవరు ? నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం, అక్టోబర్ 28 నుంచి తొలి దశ పోలింగ్
Bihar assembly polls schedule announced | (Photo Credits: File Image)

Patna, October 26: ప్రపంచానికి సుపరిపాలన అందించిన నగరంగా, విద్యాలయాల భూమిగా ఒకప్పుడు విరాజిల్లిన బీహార్ ఇప్పుడు ఆటవిక రాజ్యంగా అపకీర్తిని అందుకుంటూ వస్తోంది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి పాట్నా ఆనాటి పాటలీపుత్రనగరం. మౌర్యసామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి. బౌద్ధ, జైన మతాలకు బీహార్ జన్మస్థలం.

బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత ప్రవక్త మహావీరుడు బీహారులోని వైశాలిలో జన్మించాడుజ ఇలాంటి రాష్ట్రం ఇప్పుడు ఆటవిక రాజ్యం అంటూ అపనిందలు మోస్తూ వస్తోంది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఈ రాష్ట్రంలో ఈ నెల 28న తొలి ధపా పోలింగ్ (Bihar Assembly Elections 2020) జరగనుంది. నేటితో బీహార్ లో తొలి దఫా ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ఇప్పటికే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

ఢిల్లీలోనూ పాగా వేస్తాం, సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు, కేంద్రంపై విరుచుకుపడిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, శివసైనికుల ఆగ్రహం తట్టుకోలేరంటూ చురక

జేడీయూ అధినేత నితీష్ కుమార్

జేడీయూ (JDU) అధినేత, సీఎం నితీశ్‌కుమార్‌ (Nitish Kumar) నాలుగోసారి సీఎం పీఠంకోసం ఎన్నికలకు రెడీ అయ్యారు. 15 ఏళ్ల క్రితం బీహారీలకు ఓ ధైర్యంలా కనిపించిన సుశాసన్‌ బాబుకి ఇప్పుడు పరిస్థితులు అనుకూలించేలా కనపడటం లేదు. రాష్ట్రంలో ఆయన సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి నిరుద్యోగం భారీగా పెరిగింది. అంతేగాక 2015 ఎన్నికల్లో ఆర్జేడీతో దోస్తీ చేసి గెలిచి, ఆ తర్వాత సీఎం పీఠం కోసం.. బీజేపీ పంచన చేరటంతో నితీశ్‌పై ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

బీజేపీ

ఎప్పుడూ ఎన్నికల్లో దేశ భక్తిని ప్రయోగించే బీజేపీ (BJP) ఈ సారి కూడా అదే మంత్రాన్ని జపిస్తోంది. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 హోదాను తొలగించటం, అయోధ్యలో రామాలయ నిర్మాణమే అక్కడ ఆ పార్టీకి ప్రధాన ప్రచారాస్ర్తాలుగా మారాయి. 2015 ఎన్నికల్లో బీహార్‌కు లక్షకోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో ఆ ఊసెత్తకుండా ఆర్టికల్‌ 370 రద్దునే ప్రధానంగా ప్రస్తావించారు.

లోక్‌జనశక్తి పార్టీ (LJP)

ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని పార్టీలకూ చిరాగ్‌ పాశ్వాన్‌ పెద్ద తలనొప్పిగా మారనున్నారు. లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇటీవలే మరణించటం, ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు, ఎల్జేపీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌.. బీహార్‌లో ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఎల్జేపీ ఈ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తున్నది. ఆ పార్టీ సొంతంగా ఎక్కువ స్థానాలు గెలువకపోయినా దళితుల ఓట్లు గణనీయంగా చీల్చే అవకాశం ఉన్నది. దాంతో ఎన్డీఏ కూటమి పార్టీలు చిరాగ్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు నితీశ్‌ను దెబ్బతీసి, ఈసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవటం కోసం బీజేపీ పరోక్షంగా చిరాగ్‌ను నడిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధికారంలోకి వస్తే సీఎం నితీశ్ కుమార్ తప్పకుండా జైలుకెళ్తారని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బక్సర్‌లోని దుమ్రాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం నితీశ్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. మద్యం రద్దు విఫలమైందని విమర్శించారు. అక్రమ మద్యం అమ్మకాల ద్వారా సీఎం నితీశ్ కుమార్‌కు ముడుపులు అందుతున్నాయని చిరాగ్ ఆరోపించారు. బీహార్ ఫస్ట్ కోసం ప్రతి ఒక్కరు ఎల్జేపీకి లేదా బీజేపీకి ఓటు వేయాలని, నితీశ్‌ లేని ప్రభుత్వం కోసం సహకరించాలని ఓటర్లను కోరారు.

ఆర్జేడీ (RJD)

బీహార్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన లాలూప్రసాద్‌ యాదవ్‌..ఆ తరువాత బీహార్ ని ఆటవిక రాజ్యంగా మార్చారనే అపవాదును మూటగట్టుకున్నారు. ప్రస్తుతం అవినీతి కేసులో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన కొడుకు తేజస్వీయాదవ్‌ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ సహా వామపక్షాలు, చిన్నపార్టీలతో మహాకూటమిని ఏర్పాటుచేసి దానికి నాయకత్వం వహిస్తున్నారు. తమ పార్టీపై ఉన్న జంగిల్‌రాజ్‌ ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నితీశ్‌ సభలకంటే తేజస్వీ సభలకే ప్రజలు భారీగా హాజరవుతున్నారు. దీంతో ఆర్జేడీకి మళ్లీ ప్రాభవం దక్కుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు బీహార్‌లో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.అందుకే ఆర్జేడీతో జత కట్టింది.

తన తం‍డ్రి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, నవంబర్‌ 9న జైలు నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి బయటకు వచ్చిన వెంటనే నితీష్‌ పదవి నుంచి దిగిపోక తప్పదని జోస్యం చెప్పారు. సీఎంకు ఇక ఫేర్‌వల్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

ఆర్జేడీ ఆఫర్ : బీహార్‌ యువతకు పది లక్షల ఉద్యోగాలిస్తామని, రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు తేజస్వీయాదవ్‌ శనివారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

ఆర్జేడీ వర్సెస్ జేడీయూ

మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై సీఎం నితీశ్‌కుమార్‌ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘మీ తల్లిదండ్రులు (లాలూప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవి) అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క స్కూలు, కాలేజీ అయినా నిర్మించారా? లేక అక్రమంగా ఆస్తులు కూడబెట్టారా? అన్నది మీ తండ్రిని లేదా తల్లిని అడుగు’ అంటూ తేజస్వీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే జనతాదళ్ రాష్ట్రవాది అభ్యర్థి నారాయణ సింగ్ షియోహార్ జిల్లాలోని హాత్ సార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం జరుగుతుండగానే ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ సింగ్ ను దుండగులు కాల్చి చంపారు. కార్యకర్తల్లో కలిసిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురికి ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని పార్టీలు హాత్ సార్ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నాయి. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా...? లేదంటే పాత కక్షల కారణంగానే చంపేశారా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరగబోతుంది. నవంబర్‌ 3న రెండో, 7న చివరి విడత పోలింగ్‌.. 10న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.