CM Nitish Demands Special Status for Bihar (Photo Credits: X/@ANI)

Patna, February 12: బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం నేడు బలపరీక్షకు రెడీ అయింది. మహాఘట్ బంధన్ నుంచి బయటకి వచ్చాక బీజేపీతో జట్టుకట్టి నితీశ్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో నితీశ్ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. నితీశ్‌కు చెందిన జనతాదళ్(యునైటెడ్), బీజేపీ కూటమి విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతోంది. 14 రోజుల తరువాత అంటే ఈరోజు (ఫిబ్రవరి 12) బీహార్‌ అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో (Bihar Floor Test) నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదా అనేది తేలిపోనుంది.

బీహార్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243గా ఉంది. దీనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండు వంతులు అంటే 122 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సంఖ్య 122 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది. 243 సభ్యులున్న అసెంబ్లీలో నితీశ్ కూటమి ప్రస్తుత బలం 128. అంటే మెజారిటీ మార్క్ 122 కంటే 6 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు.

మరికాసేప‌ట్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌, క్యాంపుల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు

నేడు బల పరీక్షకు శాసనమండలి సభ్యుడిగా ఉన్న నితీష్‌ కుమార్‌ను మినహాయించి జేడీ(యూ)కి చెందిన 45 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ) మిత్రపక్షమైన బీజేపీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరితో పాటు ఎన్డీఏ (Nitish Kumar-Led NDA Government) భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నితీష్‌కు మద్దతు పలికారు. ఒకే స్వతంత్ర అభ్యర్థి నితీష్ కుమార్‌ వెంట నిలిచారు. ఈ విధంగా నితీష్ కుమార్ రాజ్ భవన్‌లో మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతును చూపించారు. అనంతరం కొత్త మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రతి పక్షంలో 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున రాజ్‌భవన్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం ఆర్జేడీలో 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు.